స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం అర్ధరాత్రి ఎల్బీనగర్‌లోని ఓ కార్ షో రూమ్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే దాని పక్కనే మల్టీప్లెక్స్, అపార్ట్మెంట్లు ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకి గురయ్యారు. ఈ మంటల్లో 20కి పైగా కార్లు కాలిపోయాయి. అది ‘కార్ మెన్ కార్’ అనే సెకండ్ హ్యాండ్ కార్ల గ్యారేజ్ అని తెలిసింది.
స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు ఆర్పుతున్న సమయంలో కార్ల గ్యారేజీలో ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. దాంతో భారీ శబ్దాలతో మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిప్రమాదంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముందు జాగ్రత్తగా పోలీసులు స్థానికులను ఖాళీ చేయించారు. ఈ అగ్నిప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే, దాదాపు గంటసేపు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు ఫైర్ సిబ్బంది. మంటలు అదుపులోకి రావడంతో అటు స్థానికులు, ఇటు అగ్నిమాపక సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. సెకండ్ హ్యాండ్ కార్ల షో రూమ్‌లోని 20కి పైగా కార్లు అగ్నికి ఆహుతయ్యాయి.