స్వతంత్ర వెబ్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ట్రాన్స్‌పోర్ట్ నగర్ ప్రాంతంలోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు భవనమంతా వ్యాపించాయి. దీంతో అందులో చిక్కుకున్న ప్రజలు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. ప్రమాదం నుంచి తమను తాము రక్షించుకునేందుకు కొందరు మొదటి అంతస్తు నుంచి కిందకు దూకేశారు. భారీగా ఎగిసిపడుతున్న మంటల పక్కనుంచి వారు కిందకు దూకుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ కమర్షియల్ కాంప్లెక్స్‌లో వస్త్రదుకాణం, ఇండియన్ బ్యాంక్‌తో పాటు పలు దుకాణాలున్నాయి. ఇవన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు.
బ్యాంక్‌లో మొదలైన మంటలు క్షణాల్లోనే ఇతర దుకాణాలకు వ్యాపించినట్లు తెలుస్తోంది. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని అధికారులు తెలిపారు. అయితే ఆస్తినష్టం భారీగానే ఉండొచ్చని తెలుస్తోంది. ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.


