వరి కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్ రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. పంట తేమకు సంబంధించి రైతుల్లెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సివిల్ సప్లైస్ కమీష నర్ డీఎస్ చౌహాన్ స్పష్టం చేశారు. జూన్ 30 వరకు వరి సేకరిస్తామని, పంట కొన్న 2 రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని కమీషనర్ అన్నారు. రాష్ర్టంలో కొన్నిచోట్ల తేమ, తాలు అంటూ ట్రేడర్లు పంటకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండించిన పంట చివరి గింజ వరకు కొంటామని, తేమ విషయంలో రైతులు సైతం జాగ్రత్తలు తీసుకోవాలని కమీషనర్ చౌహాన్ సూచిస్తున్నారు.
ఎంతో శ్రమించి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి మార్కెట్‌కు తీసుకొచ్చారు రైతులు. దళారులు ఇష్టం వచ్చినట్టు ధరలు నిర్ణయిస్తున్నారని మూడు రోజుల క్రితం జనగామ రైతులు నిరసన చేశారు. వరి సేకరణకు సంబంధించి క్వింటాల్‌కు 2,203 రూపాయలను ప్రభుత్వం కనీస మద్దతు ధరను కేటాయించింది. తేమ, తాలు సాకు చెపుతూ ట్రేడర్లు 1,551 రూపాయాలు, 1,569, 1,659 రూపయాల ధరలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న డిపార్ట్‌మెంట్ వారు..వరి సేకరణ విషయంలో ట్రేడర్లు రైతులకు అన్యాయం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వరి కొనుగోళ్ల విషయంలో ప్రతి ఏడాది రైతులకు, వ్యాపారులకు తేమ, తాలు విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఒకసారి IKP సెంటర్ల దగ్గర చెక్ చేసిన ధాన్యాన్ని మిల్లర్లు రెండవ సారి చెక్ చేయడాన్ని తీసి వేయాలని రైతులు కోరుతున్నారు. దీంతో పాటు ఏదో ఒక బ్యాగ్‌లో తేమ ఉండడాన్ని చూపిస్తూ.. మిగిలిన బ్యాగులను కలపడాన్ని రైతులు గత కొన్ని ఏళ్లుగా తప్పుపడుతున్నారు. మరోవైపు నెలల తరబడి ప్రభుత్వం బిల్లులు పెండింగ్‌లో ఉంచడంతో…మిల్లర్లు రైతుల మీద పడి దోచుకుంటున్నారని వ్యవసాయ రంగ విశ్లేషకులు అంటున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం 17 శాతం లేదా అంతకన్నా తక్కువ తేమ ఉండేలా చూడాలని రైతులను కోరుతోంది. పంట పూర్తి స్థాయిలో పండిన తర్వాతే వరికోత మొదలు పెట్టాలని సివిల్ సప్లైస్ కమీషనర్ డీఎస్ చౌహాన్ రైతులకు సూచిస్తున్నారు. వాతావరణంలో మార్పుల వల్ల ఎండాకాలంలో కూడా వర్షాలు పడుతుం టాయి. దీంతో పాటు వడ్లను అరపెట్టడం, తేమ లేకుండా చేయడం రైతులకు కష్టంగా మారుతోంది. ఇక ఇదే సాకు చెప్పి కొంత మంది వ్యాపారులు తేమ, తాలు లేకపోయినా రైతులను మోసం చేస్తున్నారు.
ఇక రాష్ర్టంలో గతంలో ఎన్నడూ లేని విధంగా, వారం రోజుల ముందు నుంచే వరి సేకరణ మొదలు పెట్టామని డీఎస్ చౌహాన్ అన్నారు. ఇప్పటి వరకు లక్షా 87వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామనీ, ధాన్యం బాగున్న చోట్ల మద్దతు ధర కంటే ఎక్కువ రేట్‌కి వరి కొనుగోలు జరిగిందన్నారు. వరి సేకరణ విషయంలో ట్రేడర్లు ఇబ్బంది పెడితే 1967 నెంబర్‌కు లేదా అధికారుల దృష్టికి తీసుకురా వాలని కమీషనర్ చౌహాన్ రైతులకు సూచించారు. పంట కొనుగోళ్లకు సంబంధించి సివిల్ సప్లైస్, మార్కెటింగ్ శాఖలో రైతులకు అనుకూల మార్పులు రావాల్సిన అవసరం ఉంది. మిల్లర్ల ప్రలోభాలకు ప్రభుత్వ అధికారులు లొంగిపోతారనే విమర్శలను నుంచి ప్రభుత్వం బయట పడాలి. దేశానికి అన్నం పెట్టే రైతుల పక్షాన ప్రభుత్వం నిలబడినప్పుడే రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయనేది అందరికీ తెలిసిన సత్యం.


