ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే భానుడు ప్రభావం చూపటంతో పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బోరు బావుల్లో నీరు రావటం లేదు. భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. పంటలు ఎండిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజక వర్గంలో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
రైతు ఆధారం వ్యవసాయం. పంటలే వారికి జీవనాధారం. కాయా కష్టం చేయనిదే రైతన్నకు లాభం ఉండదు. అలాంటిది కళ్ళ ముందే…చేతికొచ్చిన పంట ఎండిపోతుంటే రైతులు తల్లడిల్లిపోతున్నారు. పొలాలను కాపాడుకు నేందుకు స్తోమతకు మించి ఆపసోపాలు పడుతున్నారు. 50 వేలకు ఒక్కో బోరు చొప్పున ఒక్కో రైతు పదుల సంఖ్యలో బోర్లు వేయించినా చుక్క నీరు పడటం లేదు. అసలే బోరు బావులపై ఆధారపడి వ్యవసాయం చేసుకునే ప్రాంతం. దీనికి తోడు భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి.
కాలువల్లో నీళ్లు రాక, చెరువులు ఎండిపోవడం, బోర్లలో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి వేసిన పంట కళ్ళ ముందే ఎండిపోతుండడంతో వారి బాధ వర్ణనాతీతం. పెట్టిన పెట్టుబడి కూడా రాదనే ఆవేదనలో ఉన్నారు రైతులు. తమను ప్రభుత్వమే ఆదుకోవా లని వేడుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలోని దర్పల్లి, సిరికొండ మండలా ల్లోని పలు గ్రామాల్లో సాగునీరు అందక రైతులు అవస్థలు పడుతున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలో సాగు నీటి వనరులు తక్కువ. భూగర్భ జలాలపై ఆధారపడి వ్యవసాయం సాగిస్తారు రైతులు. అయితే ఇక్కడి రైతుల కోసం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కింద ప్యాకేజీ 21 పనులు పూర్తయితే కర్షకులకు సాగు నీరు అందుతుంది. కానీ, ప్రాజెక్ట్ పనులు నిలిచిపోయాయి. ఏళ్ల నుంచి పనులు సాగుతూనే ఉన్నాయి. రబీ పంటను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.