స్వతంత్ర వెబ్ డెస్క్: కోకాపేట (Kokapeta) భూములకు కోట్లలో ఆదాయం రావడంతో అదే ఊపుతో హెచ్ఎండీఏ(Hmda)) పలుచోట్ల జాగాల అమ్మకానికి రెడీ అయ్యింది. ఇక్కడ వందెకరాల విస్తీర్ణం ఉన్న 14 ప్లాట్ల అమ్మకానికి నేడు వేలం పాట నిర్వహించనుంది. బుద్వేల్ భూముల అమ్మకం నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది.
ఈ స్థలాన్ని హైకోర్టుకు కేటాయించాలని 2012 మార్చి 12న ప్రతిపాదన వెళ్లిందని చెబుతోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్(Budvel)లోని సర్వేనెంబర్ 282, 299 లో ఉన్న 100 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండీఏ వేలానికి ఉంచాయి. ఆ వేలాన్ని అడ్డుకొని, ఆ భూమిని హైకోర్టుకు కేటాయించేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతూ బార్ అసోసియేషన్ కార్యవర్గానికి చెందిన కొందరు సభ్యులు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే కు వినతిపత్రం సమర్పించారు.
బుద్వేల్‌లో హైకోర్టు భవనం నిర్మాణానికి 100 ఎకరాలు కేటాయించాలని అసోసియేషన్, రిజిస్ట్రార్ జనరల్ పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం పట్టించుకోకుండా వేలం నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయడాన్ని సవాలు చేస్తూ ప్రదీప్‌రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తరలింపుపై భిన్నాభిప్రాయాలు ఉన్నందున అధ్యక్షుడు, కార్యవర్గంతో చర్చించాలని పిటిషనర్‌కు ధర్మాసనం సూచించింది.