స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. వైసీపీ అధిష్టానంపై తిరుగుబావుటా వేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు సింహపురి వాసులే కావడం విశేషం. తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఆయన సొంత బాబాయ్ నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అనిల్ గెలవడం కోసం రూప్ ఎంతో శ్రమించారు. అనంతరం అనిల్ మంత్రి కావడంతో నెల్లూరు నగర రాజకీయాలను రూప్ కుమార్ చూసుకునేవారు.
అయితే కొంతకాలంగా వీరిద్దరి మధ్య వర్గపోరు తలెత్తింది. అప్పటినుంచి ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ విభేదాలపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల కావలి పర్యటనకు వచ్చిన ఆయన వీరిద్దరి చేతులు కలిపి విభేదాలను పక్కనపెట్టి పనిచేయాలని సూచించారు.
అంతవరకు బాగానే ఉన్నా తాజాగా అనిల్ కుమార్ స్థానిక నేతలకు పంపిన వాట్సాప్ సందేశాలు సంచలనంగా మారాయి. తాను దేవుడిగా భావించే జగనన్న మాటని తప్పాల్సి వస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతా కానీ రూప్ కుమార్ తో మాత్రం కలిసే ప్రసక్తే లేదని కుండబద్ధలు కొట్టారు. దాంతో నెల్లూరు జిల్లా రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి.