స్వతంత్ర వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ వ్యవహారం మరో మలుపు తిరిగింది. పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. లైంగికంగా వేధింపుల కేసులో ఆయనపై కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నారాయణ తనను లైంగికంగా వేధిస్తోన్నాడంటూ ఆయన తమ్ముడి సుబ్రహ్మణ్యం అలియాస్ మణి భార్య కృష్ణ ప్రియ ఆరోపించిన విషయం తెలిసిందే. తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఆమె రెండు రోజుల కిందట ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలను పోస్ట్ చేశారు. నారాయణ తనను లైంగికంగా హింసించేవాడని, లైంగికంగా వేధింపులకు గురి చేశాడని ఆరోపించారు.
కొన్ని సంవత్సరాలుగా ఈ వేధింపుల పర్వం కొనసాగుతోందంటూ కృష్ణప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని ఎదుర్కొనే శక్తి తనకు లేదంటూ కన్నీరు పెట్టుకున్నారు. 2019 నాటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేయాలంటూ నారాయణ తనను అనేక ఇబ్బందులకు గురి చేశారనీ చెప్పారు. తన కుటుంబాన్నీ ఎంతో కష్టపెట్టారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొనడం తనకు ఇష్టం లేనప్పటికీ.. తాను వద్దని చెబుతున్నప్పటికీ.. వినిపించుకోలేదని, మానసికంగా ఎంతో చిత్రహింసలకు గురి చేశారని కృష్ణప్రియ వాపోయారు.
ఈ వీడియో పోస్ట్ చేసిన తరువాత తనపై వేధింపులు మరింత పెరిగాయని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. నారాయణపై ఈ ఉదయం రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. తాను మానసిక వ్యాధితో బాధపడుతున్నానంటూ భర్త చేసిన ప్రకటనలో వాస్తవం లేదని తేల్చారు.


