స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 20 నుంచి 25 వరకు అమెరికా, ఈజిప్టులో పర్యటించనున్నారు. మంగళవారం అమెరికా బయలుదేరి వెళ్లనున్న మోదీ.. ఈనెల 21న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో.. అంతర్జాతీయ యోగా దినోత్సవాలకు నేతృత్వం వహిస్తారు. ఈనెల 21న ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు న్యూయార్క్‌లో జరిగే యోగా సెషన్‌లో.. ఐరాస ఉన్నతాధికారులు, పలు దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు కూడా పాల్గొంటారు. అక్కడి నుంచి వాషింగ్టన్ వెళ్లనున్న ప్రధాని.. 22న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తర్వాత కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడతారు. అదే రోజు సాయంత్రం.. బైడెన్ దంపతులు ఇచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు. 23న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇచ్చే విందుకు హాజరుకానున్న ప్రధాని.. పలు కంపెనీల సీఈఓలు, వేర్వేరు రంగాల నిపుణులతో వాషింగ్టన్‌లో చర్చలు జరుపుతారు. ప్రవాస భారతీయులతోనూ ఆయన ముచ్చటిస్తారు.