స్వతంత్ర, వెబ్ డెస్క్: పేదల గురించి ఆలోచించిన ఏకైక వ్యక్తి దివంగతముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు. రాజమండ్రిలో జరుగుతోన్న పార్టీ మహానాడు కార్యక్రమానికి తన ప్రసంగ గళాన్ని వినిపించారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఎంతో మంది నాయకులు వచ్చారు.. ఎన్నో పార్టీలు పెట్టారు.. కానీ తెలుగు వారి రుణం తీర్చుకోవడం కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని అన్నారు. మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని వ్యాఖ్యానించారు. సామాన్య కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్.. ఎంతో కష్టపడి పైకి ఎదిగారని అన్నారు. పేదల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన ఎన్టీఆర్.. తెలుగు జాతి ఉన్నంతవరకు చిరస్మరణీయంగా ఉంటారని అన్నారు. క్రీస్తు శకం.. క్రీస్తు పూర్వంలాగా ఎన్టీఆర్ శకం అని భవిషత్తులో చెప్పుకోవాల్సి వస్తుందనిఅన్నారు. రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ కె దక్కుతుందన్నారు. మహిళలకు సమాన హక్కులు, రిజర్వేషలు కల్పించిన ఘనత కూడా ఎన్టీఆర్ దేనని కొనియాడారు.