స్వతంత్ర వెబ్ డెస్క్: ‘ఎక్స్’ అక్షరం పట్ల ఎలాన్ మస్క్ వ్యామోహం ట్విట్టర్‌లో అనేక మార్పులకు దారితీసింది. పిట్ట(బర్డ్)ను ఎగరగొట్టింది. కంపెనీ పేరు, ట్వీట్ అనే పదం.. ఇలా అన్నింటిలోనూ ‘ఎక్స్’ అనే అక్షరం వచ్చి కూర్చుంది. ట్వీట్..రీట్వీట్ ఉన్న చోట ఇక నుంచి ‘ఎక్స్’ అనేది ఉంటుందని, దీనినే వాడాలని నెటిజన్లను ఎలాన్ మస్క్ తాజాగా కోరారు. అయితే ఇది పిట్టను తొలగించినంత ఈజీ కాదని నెటిజన్లు, ట్విట్టర్ రూపకల్పనలో పాల్గొన్న నిపుణులు అంటున్నారు.
అక్టోబర్ 2022లో ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత మస్క్ చేపట్టిన చర్యలు సర్వత్రా విమర్శలపాలయ్యాయి. కంపెనీలో మూడొ వంతు సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించాడు. ఎలాన్ మస్క్ తొలుత డిజిటల్ షాప్ కోసం ‘ఎక్స్.కామ్’ అనేది రూపొందించాడు. ఆ తర్వాత స్పేస్ ఎక్స్, టెస్లా మోడల్ ఎక్స్, కొడుకు పేరు ఎక్స్..ఇలా ట్విట్టర్ పేరును సైతం ఎక్స్‌గా మార్చే వరకు మస్క్ వెనుకాడలేదు.