ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ అంతా ప్రశాంతంగా సాగిందని, అదే మాదిరిగా కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా సాగేలా చూడాలని ఆదేశించారాయన.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు చివరి అంకానికి వచ్చేశాయి. జూన్ నాలుగున ఫలితాలు వెలువ డబోతున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సైతం ఆ రోజునే వెలువడ నున్నాయి. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. పోలింగ్ రోజు, ఆ తర్వాత పలు చోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయి. పల్నాడు జిల్లాతోపాటు అనంతపూర్, తిరుపతి జిల్లాల పరిధిలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడం, పోలింగ్ తర్వా త కూడా ఆయా ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ నాలుగున జరగనున్న కౌంటింగ్ కోసం గట్టి భద్రతా చర్యలు చేపడుతోంది ఎన్నికల సంఘం.
ఈ మేరకు రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఓట్ల లెక్కింపు కోసం చేస్తున్న ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో భాగంగా మే 13న స్వల్ప చెదురుమదురు ఘటనలు మినహా ఏపీ వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ సాగిందన్నారు. అదే స్ఫూర్తితో వచ్చేనెల నాలుగున జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని సైతం ప్రణాళికా బద్దంగా నిర్వహించి విజయవంతం చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆయన కోరారు. ఇందులో భాగంగానే కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను ముందుగానే చేసుకోవాలని సూచించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చూసుకోవాలని సూచించారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి. ఓట్ల లెక్కింపు ఏ రోజున, ఎన్నిగంటలకు జరుగుతుంది. ఎన్ని టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహిస్తారు అన్న వివరాలను రాతపూర్వకంగా అభ్యర్థులకు, ఎన్నికల ఏజెంట్లకు ముందుగానే తెలియ జేయాలని సూచించారు. మీడి యాకు ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. అదే మాదిరిగా స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు పోలింగ్ యంత్రాలను తరలించే మార్గాలు, అభ్యర్థులు, ఏజెంట్లు వెళ్లడానికి వేర్వేరు దారులు ఏర్పాటు చేయాలని సూచించారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి బారికేడ్లతోపాటు సూచికల బోర్డులు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరుగా టేబుళ్లను ఏర్పాటు చేయాలని సూచిం చారు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి మీనా. అలాగే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకూ ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేయాల న్నారాయన. మొదటగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు లెక్కించిన తర్వాత ఈవీఎంల వారీగా పోలైన ఓట్లను లెక్కించాలని సూచించారు. ఇందుకోసం అవసరమైన సుశిక్షితులైన సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశించారు. అలాంటి వారికి శిక్షణ సైతం ఇవ్వాలని సూచించారు. హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యంతో అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లను కౌంటింగ్ కేంద్రాల వద్ద సిద్దంగా ఉంచాలని ఆదేశించారు.ఓట్ల లెక్కింపు సందర్భంగా గుర్తింపు కార్డులు లేని వారిని, అనధికార వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ జరిగే పరిసరాల్లోకి అనుమతించవద్దని సూచించారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. మొత్తంగా సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కౌంటింగ్ ప్రక్రియను సైతం విజయవంతంగా పూర్తి చేయాలని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు ముఖేష్ కుమార్ మీనా.