ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ ఈనెల 27 నుంచి ప్రచారానికి సిద్దమవుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రేపటి నుంచి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచార బరిలోకి దిగుతున్నారు. వారాహి వాహనంలోనే ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు వారాహి వాహనాన్ని సిద్ధం చేయాలని పార్టీ నాయకులను పవన్ ఆదేశించారు.
వచ్చే వారం పిఠాపురం నుంచే ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. పవన్ దాదాపు 20 రోజులపాటు ప్రజాక్షేత్రంలో ఉండనున్నారు. జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో రెండు సార్లు పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాజోలులో జనసేన జెండా మరోసారి ఎగరాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. రెండు రోజుల పాటు రాజోలు నియోజకవర్గం పార్టీ నాయకులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్‌తో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. రాజోలు నియోజకవర్గ పరిస్థితిపై చర్చించారు.