తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై సీఎస్. శాంతికుమారి సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. జూన్ 2న సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు శాంతికుమారి తెలిపారు. ఆ రోజు సీఎం రేవంత్‌రెడ్డి గన్‌పార్క్‌ను సందర్శించి, తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించనున్నారు.
వేడుకలను నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి అనుమతి ఇవ్వడంతో తగిన విధంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రముఖులకు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, రాకపోకలకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు చేపట్టాలని పోలీసు శాఖకు సూచించారు. ప్రజలు ఎండకు గురికాకుండా షామియానాలు ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ శాఖను ఆదేశించారు. తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, సభా పరిసరాలు ఆకర్షణీయ అలంకరణలతో ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు, పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారు లతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖకు సూచించారు. నిరంతరాయంగా త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముఖ్యఅతిథి గా సోనియాగాంధీని ఆహ్వానించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం సీఎం సహా కాంగ్రెస్ ముఖ్య నేతలు ఒకట్రెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే ఈ విషయంపై సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ కోరారు.