లోక్సభ ఎన్నికలు తరుముకువస్తున్న వేళ, తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం సంభవించింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రచారంపై 48 గంటలపాటు నిషేధం విధించింది కేంద్ర ఎన్నికల సంఘం. మే ఒకటో తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచి నిషేధ ఉత్తర్వులు అమలు అవుతాయని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధం అమలులో ఉన్న సమయంలో ఏ రకమైన ప్రచారంలోనూ కేసీఆర్ పాల్గొనకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఏప్రిల్ ఐదవ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలపై నిందాపూర్వక ఆరోపణలు చేసినట్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. దీంతో కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘానికి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. నిందాపూర్వక దూషణలపై వివరణ ఇవ్వాల్సిందిగా కేసీఆర్ను కోరింది. దీంతో కేసీఆర్ వివరణ ఇచ్చారు. అయినప్పటికీ కేసీఆర్ వివరణతో కేంద్ర ఎన్నికల సంఘం సంత్రుప్తి చెందలేదు. దీంతో 48 గంటలపాటు ప్రచారం చేయకుండా కేసీఆర్ పై నిషేధం విధించింది. గతంలో కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని ఎన్నికల సంఘం పేర్కొంది. 2019,2023 ఎన్నికల్లో కూడా ఎన్నికల సంఘం నిబంధనలను కేసీఆర్ ఉల్లంఘిం చారని ఈసీ వెల్లడించింది. తాజా నిందాపూర్వక దూషణలతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు ఈసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో 48 గంటలపాటు బహిరంగ సభలు, ప్రదర్శనలు, ర్యాలీలు, ఇంట ర్వ్యూలు, రోడ్ షోలు, మీడియాలో బహిరంగంగా మాట్లాడటం చేయకూడదని కుండబ ద్దలు కొట్టింది కేంద్ర ఎన్నికల సంఘం.
మహబూబాబాద్ పట్టణంలో ప్రచారంలో ఉండగా, కేసీఆర్కు ఆదేశాలు అందచేశారు ఎన్నికల సంఘం అధికారులు. దీంతో ఈసీ ఆదేశాల మేరకు మే ఒకటవతేదీ రాత్రి ఎనిమిది గంటలలోగా కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలపై కేసీఆర్ స్పందించారు. సిరిసిల్లలో ఎన్నికల అధికారులుగా ఉన్నవారు తెలుగువారు కాదన్నారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీపై తాను చేసిన వ్యాఖ్యలకు ఇంగ్లీషు అనువాదం సరిగా జరగలేదన్నారు.అంతేకాదు తన వ్యాఖ్యలకు ఎన్నికల అధికారులు వక్రభాష్యం చెప్పారని కేసీఆర్ ఆరోపించారు. వ్యక్తిగతంగా తాను ఏ కాంగ్రెస్ నాయకుడిపైనా విమర్శలు చేయలేదని వివరణ ఇచ్చారు కేసీఆర్. కేవలం కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలను మాత్రమే తప్పు పట్టానన్నారు. హస్తం పార్టీ విధానాలపై తాను చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నానన్నారు కేసీఆర్.
కేసీఆర్ ప్రచారంపై నిషేధం విధించడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత హరీశ్ రావు స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న అసభ్య పదజాలం ఎన్నికల సంఘానికి కనిపించడం లేదా ? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తీసుకువచ్చిన కేసీఆర్పై రేవంత్ రెడ్డి ఇష్టారాజ్యంగా నోరు పారేసుకోవడం తగునా ? అని ప్రశ్నించారు. అంతేకాదు…ఎన్నికల ప్రచారంలో భాగంగా సమాజంలో మత విద్వేషాలు రగిల్చేలా ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న ప్రసంగాలు, ఎన్నికల సంఘానికి వినిపించడం లేదా ? అని సూటిగా ప్రశ్నించారు.
కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం విధించడంపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇదెక్కడి అరాచకం ? ఏకంగా తెలంగాణ ఆవాజ్ అయిన కేసీఆర్ గొంతుపైనే నిషేధమా ? అంటూ ఫైర్ అయ్యారు. ఇదంతా బడే భాయ్…ఛోటే భాయ్ చేసిన కుట్ర అంటూ ఘాటు ఆరోపణలు చేశారు. మరో పదిరోజుల్లోగా తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణలోని మొత్తం 17 నియోజకవర్గాల్లో అత్యధిక సీట్లు గెలుచుకోవడానికి మూడు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతు న్నాయి. ఎన్నికల ప్రచారాన్ని హెరెత్తిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత కొంతకాలం పాటు కేసీఆర్ మౌనంగా ఉన్నారు. తాజాగా కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటలపాటు ఈసీ నిషేధం విధించింది. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపింది.


