స్వతంత్ర వెబ్ డెస్క్: గుజరాత్‌లో అల్లకల్లోలం సృష్టించిన బిపోర్‌జాయ్ తూఫాను.. గురువారం అర్ధరాత్రి కచ్ ప్రాంతంలో తీరాన్ని దాటింది. ప్రస్తుతం బలహీనపడిన బిపోర్‌జాయ్ ఈశాన్య దిశగా కరాచీ వైపు కదులుతుందని.. సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తూఫాను ప్రభావంతో కచ్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. మాండ్విలోని పలు ప్రాంతాల్లో నివాస సముదాయాలు, ఆసుపత్రుల్లోకి వరదనీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీర ప్రాంతాల్లోని దాదాపు 940 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తూఫాను ప్రభావంతో పశ్చిమ రైల్వే పలు సర్వీసులను రద్దు చేసింది. అనేక రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా కొన్నింటి ప్రయాణాన్ని కుదించారు.
వరద పరిస్థితుల దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో ఫోన్లో మాట్లాడారు. తుఫాను పరిస్థితుల గురించి ఆరా తీశారు. గిర్ అడవుల్లో వణ్యప్రాణుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. సహాయక చర్యలకు కేంద్రం అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సాయంత్రానికి రాజస్థాన్‌లోనూ తుపాను ప్రభావం కన్పించనుంది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో బర్మేర్ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అటు ముంబయిలోనూ తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది.