ప్రతి భారతీయునికి ఆధార్ కార్డు నిత్యావసరమై పోయింది. బ్యాంకులకి వెళ్లినా, ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ చేసినా, ఇల్లు కొనాలన్నా, అమ్మాలన్నా ఇలా ఒకటి కాదు, ఆఖరికి రైల్వే టికెట్టు కావాలన్నా ఆధార్ తప్పనిసరై పోయింది. అయితే దీనిని చదువుకున్నవారే కాదు, చదువులేని అమాయకులు కూడా వాడుతున్నారు. అయితే వారికి తెలియకుండా పంపించమన్న వాళ్లందరికీ పంపించేస్తున్నారు. ఇప్పుడదే పెద్ద సమస్యగా మారిందని కేంద్రం చెబుతోంది. మరి ఆ సంగతులేమిటో చూద్దామా…
భారత దేశానికి ఆధార్ కార్డు ఒక వరంలా మారిందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడదే శాపంగా కూడా మారిందని పలువురు వ్యాక్యానిస్తున్నారు. ఎందుకంటే ప్రతీ ఒక్కరికి కూడా ఆధార్ లేనిదే పనులు జరగడం లేదు. ముఖ్యంగా ఆన్ లైన్ వ్యవహారాల్లో ఆధార్ కార్డు కీలక భూమిక పోషిస్తోంది. ఇలాంటి సమయంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కీలక ప్రకటన చేయడం, ప్రజలను అప్రమత్తంగా ఉండమని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఇంతకీ కేంద్ర ప్రకటన సారాంశం ఏమిటంటే ఆధార్ కార్డు, వాటి కాపీలను ఎక్కడపడితే అక్కడ పడేయవద్దు, అలాగే ఓటీపీని ఎవరడిగినా చెప్పవద్దని చెబుతోంది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాలు, ఇతర బహిరంగ వేదికలపై వీటిని ఇష్టం వచ్చినట్టు పెట్టవదని, ఎవరైనా అడిగితే ‘‘ఓస్…అంతేకదా!’’ అని ఈజీగా పంపించేయవద్దు. ఒకటికి పదిసార్లు ఆలోచించమని చెబుతోంది.
ఇలాగని భయపడవద్దని, ఆధార్ విషయంలో అపోహలు వద్దని, ధైర్యంగానే వాడవచ్చు, కాకపోతే ఆ వినియోగం కరెక్టుగా ఉందా? లేదా? అనేది చూసుకుంటూ ఉండమని తెలిపింది.
ఓటీపీని ఎవరితో షేర్ చేసుకోవద్దని, ఎం-ఆధార్ పిన్ నెంబర్ ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించింది. గత ఆరునెలల ఆధార్ వినియోగాన్ని యూఐడీఏఐ వెబ్ సైట్ లో, ఎం-ఆధార్ యాప్ లో చెక్ చేసుకోవచ్చునని సూచించింది.
అయితే ఆధార్ ధృవీకరణ జరిగిన ప్రతీసారి, ఆ విషయాన్ని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ ఈమెయిల్ ద్వారా సమాచారం ఇస్తుందని, అది కూడా ఒకటికి రెండుసార్లు గమనించాలని తెలిపింది. అంటే ఆధార్ తో ఏ పనైనా చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని తెలిపింది. తప్పనిసరిగా ఆధార్ ను ఈమెయిల్ కి అనుసంధానం చేసుకోవాలని సూచించింది.