భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిరూపం. అలాగని భిన్నత్వాన్ని చెరిపేసి ఏకత్వానికే పట్టం కట్టాలని రాజ్యాంగ నిర్మాతలు ఎన్నడూ భావించలేదు. కేంద్రానికి రాజ్యాంగం ఇచ్చిన నిర్వచనం యూనియన్ ఆఫ్ స్టేట్స్ తప్ప మరోటి కాదు. సమాఖ్య స్పూర్తికి రాజ్యాంగ నిర్మాతలు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. గత పదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తి ని దెబ్బతీస్తున్నాయి. రాష్ట్రాల హక్కులు హరించే విధంగా నిర్ణయాలు తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం.
ఇదిలా ఉంటే దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు కొంతకా లంగా వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి దక్షిణాదిన ఆదాయం ఎక్కువ. దక్షిణాదిన జనాభా తక్కువ. ఉత్తరాది ప్రాంతం ఇందుకు పూర్తి విరుద్ధం. ఉత్తరాదిన జనాభా ఎక్కువ… ఆదాయం తక్కువ. పన్నుల రూపంలో దక్షిణాదిలో వసూలు చేసే సొమ్మును కేంద్రం ఎక్కువగా ఖర్చు పెట్టేది ఉత్తరాదిలోనే. ఇక్కడ మరో విషయముంది. అంతేకాదు బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకే ఎక్కువ నిధులు కేటాయిస్తుందన్న విమర్శలు కూడా ఉన్నాయి. కాగా కేంద్ర ప్రభుత్వం తమపై వివక్ష చూపుతున్నదని ఆరోపిస్తూ కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.ఈ మూడు రాష్ట్రాలు దక్షిణాదివే కావడం గమనించాలి. అంతేకాదు కేరళ, తమిళనాడు, కర్ణాటక మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీయేతర ప్రభుత్వాలే ఉండటం విశేషం. సాధారణ నిధులే కాదు..ప్రకృతి బీభత్సాల సందర్బంగా రాష్ట్రాలకు అందచేయాల్సిన సాయం విషయంలోనూ కేంద్ర వివక్ష చూపుతున్నదని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తుందన్న ఆరోపణలు కొత్తవి కావు. 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం, రాష్ట్రాల్లో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని రాజ్యాంగ నిర్మాతలు ఎన్నడూ పేర్కొనలేదు. అయితే కేంద్ర ప్రభుత్వానికి కొన్ని విచక్షణాధికారాలు ఇచ్చిన మాట వాస్తవమే. ఈ విచక్షణాధికారాలను అడ్డం పెట్టుకుని కేంద్రం రాష్ట్రాల హక్కులను హరించి వేస్తోందని బీజేపీయేతర నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే హక్కుల విషయంలో సమానుల్లో ప్రథమ స్థానం అనే వైఖరితో కేంద్రం వ్యవహరిస్తోందన్న ఆరోపణలు చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి.
బీజేపీయేతర అలాగే దక్షిణాది రాష్ట్రాల విషయంలో కేంద్రం అవలంబిస్తున్న వైఖరికి సుప్రీంకోర్టు మొట్టి కాయలు కూడా వేసింది. ఏ రాజకీయ పార్టీ, ఏ ప్రాంతం అనేవాటినే ప్రామాణికంగా తీసుకుని రాష్ట్రాలకు నిధులు మంజూరు చేసే విషయంలో కేంద్రం తనకున్న విచక్షణాధికారాలను దుర్వినియోగ పరుస్తుంద న్న విమర్శలు రాజకీయ వర్గాల్లో చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి. 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు రాష్ట్రాలకు పన్నుల వాటాను కేంద్రం 32శాతం నుంచి 42 శాతానికి పెంచింది. ఇందులో సైతం ఉత్తరాది రాష్ట్రాలకు అధిక ప్రయోజనం చేకూర్చింది. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు అత్యధిక నిధులను కేంద్రం నుంచి దక్కించుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు దాదాపుగా మొండి చెయ్యే మిగిలింది.
ఇదిలా ఉంటే లోక్‌సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ విషయంలోనూ దక్షిణాదికి అన్యాయం జరగ బోతోందన్న ప్రచారం నడుస్తోంది. అటు నిధులు, ఇటు లోక్‌సభలో ప్రాతినిధ్యం తగ్గిపోతే దక్షిణాదిపై ఉత్తరాది పెత్తనం శ్రుతిమించడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలంటే, అక్కడ పెట్టే ఖర్చుకు 15 శాతం రాబడి రావాలన్నది ఒక నిబం ధన. అదే ప్రధాని నరేంద్ర మోడీ స్వంత రాష్ట్రమైన గుజరాత్‌కు ఈ నిబంధన వర్తించదు అంటోంది జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ. గుజరాత్‌లోని సోమనాథ్ చుట్టూ అభివృద్ధి చేస్తున్న జాతీయ రహదారికి మాత్రం అలాంటి షరతులేమీ పెట్టలేదు. ఈ విధమైన పక్షపాత ధోరణి దక్షిణాదిలో అసంతృప్తి పెంచుతోంది.
మన దేశంలో జనాభా ప్రాతిపదికన పార్లమెంటరీ ప్రాతినిధ్యాన్ని నిర్ణయించారు. వివిధ రాష్ట్రాల్లో 1971 జనాభా లెక్కల ప్రకారం లోక్‌సభ సీట్ల సంఖ్యను నిర్ధారించారు. 1976లో ఎమర్జెన్సీ సందర్భంగా పార్ల మెంటు రాజ్యాంగ సవరణ చేసింది. 1971 జనాభా లెక్కల ఆధారంగా ఒక్కో రాష్ట్రానికి లోక్‌సభ నియోజక వర్గాలను నిర్ణయించింది. 2000 వరకు నియోజకవర్గాల సంఖ్య పెరగరాదని చట్టం ఆదేశించింది. 2001లో జనాభా గణన గడువు ముగియగా 2026 వరకు పొడిగించారు. దాంతో యాభై ఏళ్లపాటు నియోజ కవర్గం, జనాభా నిష్పత్తికి సంబంధం లేకపోయింది. 2026 తర్వాత కొత్త జనాభా లెక్కల ప్రకారం మార్పుచే ర్పులు చేస్తే.. తక్కువ జనాభా రేటున్న దక్షిణ భారత రాష్ట్రాలు సీట్ల పరంగా నష్టపోతాయి. దీంతో జాతీయ రాజకీయాల్లో దక్షిణాది ప్రాధాన్యం తగ్గిపోవడం ఖాయం. అంతిమంగా దక్షిణాదిపై ఉత్తరాది పెత్తనం పెరగడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఇప్పటి పదేళ్లు అవుతోంది. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు అనేక హామీలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే, ఇప్పటివరకు ఏ ఒక్క హామీ అమలు కాలేదు. ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు తదితర డిమాండ్లను పక్కన పెట్టింది కేంద్రం. అలాగే తెలం గాణకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ డిమాండ్‌ను అటకెక్కిం చింది. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ సంగతిని మరచిపోయింది. అడుగడుగునా దక్షిణాదిపై వివక్షతను ప్రదర్శిస్తోంది. ఇటువంటి కారణాల వల్లనే ప్రాంతీయ ఉద్యమాలు పుట్టుకొస్తు న్నాయి. వీటి కారణంగానే రాష్ట్రాల విభజనకు డిమాండ్లు పెరుగుతున్నాయి.


