ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మరొకరికి భిన్నంగానే ఉంటారు. పుట్టిన ప్రతి బిడ్డ కూడా అంతే. కొంతమంది పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. మరికొందరు పుట్టినప్పటి నుంచి కూడా ఏదో ఒక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. అందుకే పిల్లలు పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రులకు రకరకాల ప్రశ్నలు మొదలవుతాయి. పిల్లల ఆరోగ్యం బాగుపడాలంటే అది పాటించండి.. ఇవి చేయండి అని చుట్టుపక్కలవాళ్ళు, బంధువులు తోచిన సలహాలు ఇస్తుంటారు. ఇప్పుడు తాజాగా వైరల్ అవుతున్న విషయం ఏంటి అంటే నవజాత శిశువును కంగారూ లాగా ఛాతీకి దగ్గరగా ఉంచాలట. ఇలా చేయటం ద్వారా, వారిని చలి నుంచి రక్షించవచ్చని , బిడ్డ బరువు కూడా పెరుగుతుందని చెబుతున్నారు.
ప్రస్తుత కాలంలో ప్రతిదీ కలుషితమే. ముఖ్యంగా వాతావరణం ఎంత ప్రమాదకరంగా మారింది అంటే.. దాని మూలంగా ఊహించని రోగాలు పుట్టుకొస్తున్నాయి. దీని వల్ల చిన్న పిల్లలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. జలుబు, దగ్గుతో పాటు, చర్మ సమస్యలు కూడా బాధపడుతున్నారు. అయితే కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంట్లోనే నయం చేయడానికి ప్రయత్నిస్తారు.. అనేక ఇంటి చిట్కాలు పాటిస్తారు. వీటిలో ఒకటే చంటి బిడ్డలను కంగారూ లాగా హత్తుకోవటం కూడా .
తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియొలో ఏముందంటే, పిల్లలను కంగారూ లాగా ఛాతీకి దగ్గరగా ఉంచుకుంటే బిడ్డ బరువు పెరుగుతుందని.. చలి నుంచి రక్షణ లభిస్తుందని. కౌగిలించుకోవడం వల్ల బిడ్డకు వెచ్చదనం లభించడంతో పాటు శిశువు మెదడు, నరాలు, ఎముకలు బాగా అభివృద్ధి చెందడానికి సాయపడుతుందని చెబుతున్నారు. మిగతా విషయాలు పక్కన పెడితే ఇలా చేయడం వల్ల తల్లిబిడ్డల అనుబంధం కూడా పెరుగుతుందని మనం భావించవచ్చు.
నిజానికి గతంలో మనకి ఏం చెప్పేవారంటే పిల్లల ఆరోగ్యంగా ఉండాలి అంటే వారిని అస్తమానం ఎత్తుకోకూడదు, దానివల్ల పిల్లలు అనారోగ్యంపాలవుతారు, మన ఒంట్లో వేడి వారికి తగిలి ఎదుగుదల సరిగా ఉండదు అని. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే. పిల్లలు పుట్టిన సంవత్సరం వరకు నడక రాదు. అలాంటప్పుడు ఖచ్చితంగా మనం ఎత్తుకుని తిరుగుతాం ఈ టైమ్ లో వారిని కంగారు లాగా హత్తుకొని ఉండటం మంచిది. కానీ ఈ మధ్య కాలంలొ తల్లులు ఎత్తుకోవడం చేతకాక క్యారీయింగ్ బ్యాగ్స్ వాడుతున్నారు. ఎక్కువ సమయం పిల్లల్ని మోయ లేక అవి తగిలించుకుని పిల్లలని అందులో వేసుకుని తిరుగుతున్నారు. ఈ బ్యాగ్స్ వల్ల ఎంతో సౌకర్యం అన్న మాట నిజమే కానీ పిల్లలకు తల్లి స్పర్శ తగలడం లేదు. స్పర్శ వల్ల కలిగే ప్రేమ వారిని చేరటం లేదు.
అయితే అమెరికాలో జరిగిన అధ్యయనంలో ఈ కంగారూ కేర్ విధానం గురించి ప్రత్యేకంగా చెప్పారు. ముఖ్యంగా ప్రీమెచ్యూర్ బేబీలో ఈ కంగారు మదర్ కేరింగ్ విధానం పుట్టిన మొదటి ఆరు గంటల్లోనే కార్డియోస్పిరేటరీ సిస్టమ్‌లను స్థిరీకరిస్తుందని వారి పరిశోధనలో తేలింది. అంతేగాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ, పుట్టిన వెంటనే కంగారు మదర్ కేర్ ప్రారంభించడం వలన మరణాల రేటును తగ్గించవచ్చని పేర్కొంది. ఈ విధానాన్ని తొలిసారిగా అమెరికాలో బొగోటా వైద్యులు ప్రారంభించారు. ఆసుపత్రిలో ఇంక్యుబేటర్ కొరత, ఇన్ఫెక్షన్‌ల సమస్యకు పరిష్కారంగా ఈ విధానాన్ని తీసుకొచ్చారు వైద్యులు. ఈ కేరింగ్‌ల వల్ల కలిగే సత్ఫలితాలను చూసి అమ్మలు కచ్చితంగా ఈ విధానాన్ని పాటించేలా చేస్తే బాగుంటుందంటున్నారు. తల్లులే కాదు తండ్రులు కూడా తమ బంధం బలపడటానికి రోజులో కొంత సమయం చంటి పిల్లలతో కంగారు మదర్ కేరింగ్ విధానం అమలు పరచాలి అంటున్నారు.
అప్పుడే పుట్టిన శిశువు తల్లి పొత్తిళ్లలోని వెచ్చదనానికి హాయిగా నిద్రపోతుంది. అదీగాక ఈ ఉష్ణోగ్రత బిడ్డను పలు వ్యాధుల బారినపడకుండా ఉండేలా చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. మమ్ములుగా కంగారు తన పిల్లలను తన పొట్ట మాదిరి సంచిలో చక్కగా ఉంచుకుని సంరక్షించుకుంటుంది. మనుషులకి వచ్చేసరికి తల్లులు పిల్లలను శరీరానికి తగిలేలా దగ్గరగా పెట్టుకుంటారు. ఈ కేరింగ్ తక్కువ బరువుతో పుట్టే శిశువులకు ఆక్సిజన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. ఆహారం తీసుకునేలా చేస్తుంది. శిశువు పెరుగుదలకి, అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ కంగారూ మదర్ కేర్ పద్ధతి శాస్త్రీయంగా నిరూపించబడిందని డాక్టర్లు కూడా చెబుతున్నారు. తల్లి శరీరం సహజ ఇంక్యుబేటర్ లాంటిదట. ఇది పిల్లలలో వెచ్చదనాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా పిల్లలలో అల్పోష్ణస్థితి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చర్మాన్ని చర్మంతో కలిపి ఉంచే పిల్లలు మెరుగ్గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఆక్సిటోసిన్ విడుదలకు, భావోద్వేగ బంధాన్ని ప్రోత్సహించడానికి కంగారూ మదర్ కేర్ సహాయపడుతుంది. తల్లి, బిడ్డ ఇద్దరి ఒత్తిడిని తగ్గించడంలో సాయపడుతుంది. కంగారూ సంరక్షణ పిల్లలకు చాలా ప్రభావవంతంగా ఉంటుందని నిరూపించబడింది. తల్లి చర్మంతో ప్రత్యక్ష సంబంధం వల్ల బ్యాక్టీరియా బదిలీ అయి పిల్లల రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధికి సహాయపడుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు.