Afternoon Sleep |మధ్యాహ్న సమయంలో భోజనం చేసిన తర్వాత కొంచెం సేపు పడకపై నడుం వాల్చడం ఒక అలవాటుగా ఉంటుంది చాలామందికి. దీని ద్వారా మనస్సుకు కొంత విశ్రాంతి లభించడంతో పాటు.. ప్రశాంతత లభిస్తుంది. అందుకే మధ్యాహ్నం కాస్త నిద్రపోవడానికి ప్రయత్నిస్తారు. అయితే సెలవుల సమయంలో.. పెద్దగా పని లేనప్పుడు చాలా మంది అదే పనిగా మధ్యాహ్న సమయంలో ఎక్కువసేపు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది కాదని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. మధ్యాహ్న నిద్ర వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాల గురించి తెలుసుకుందాం. పగటిపూట చాలా మంది నిద్రపోవడానికి ఇష్టపడతారు. రాత్రి మంచి నిద్ర లేకపోవడం వల్ల కూడా మధ్యాహ్నం నిద్రవచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మధ్యాహ్న సమయంలో ఎక్కువ సేపు నిద్రపోయినా, రాత్రి సమయంలో త్వరగా నిద్ర పట్టదు. పని ఎక్కువగా ఉన్నా.. శరీరం కాస్త విశ్రాంతిని కోరుకుంటుంది. అయితే చాలా మంది గృహిణులు ఇంటి పని పూర్తి చేసుకుని మధ్యాహ్నం పడుకుంటారు. మధ్యాహ్నం సమయంలో నిద్ర పోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నా.. నష్టాలు ఉన్నాయి.
మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. రాత్రిపూట పనిచేసే వ్యక్తులు ఎక్కువసేపు మెలకువగా ఉంటారు. దాని వల్ల అలసట పెరుగుతుంది. ఒత్తిడి స్థాయి కూడా క్రమంగా పెరుగుతుంది. ఈ పరిస్థితి చాలా కాలం పాటు కొనసాగితే.. క్రానిక్ ఫెటీగ్ తీవ్రమవుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ రకమైన ఒత్తిడిని తగ్గించడానికి పగటిపూట నిద్రపోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా మంది తాము చేసే పని వల్ల ఉదయం నుంచి మధ్యాహ్నానికి అలసిపోతారు. శరీరం సిర్కాడియన్ రిథమ్‌ను అనుసరిస్తుంది. ఇందులో ప్రతి 12 గంటలకొకసారి శరీర ఉష్ణోగ్రత కాస్త తగ్గుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రధానంగా మధ్యాహ్నం ఉంటుందంటున్నారు. అందుకే వ్యక్తి మధ్యాహ్నం కాస్త అలసటగా ఫీల్ అవుతూ ఉంటారని చెప్తారు. కాబట్టి 30 నిమిషాలకు మించకుండా నిద్రపోవడం వల్ల అలసట నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. మధ్యాహ్నం సమయంలో అప్రమత్తంగా ఉండటం కష్టం. దీనిని పోస్ట్-లంచ్ డిప్ అని పిలుస్తారు. ఇది ప్రధానంగా మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల మధ్య జరుగుతుంది. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత కొద్దిగా తగ్గుతుంది. దీని కారణంగా నీరసం, చురుకుదనం కూడా తగ్గుతుంది. కాబట్టి కొంచెం నిద్రపోవడం రిఫ్రెష్‌గా ఉండటానికి సహాయపడుతుంది.
మధ్యాహ్నం చిన్న నిద్ర(Afternoon Sleep) తీసుకోవడం సర్వసాధారణం. కానీ మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు వైద్య నిపుణులు. ఇది రాత్రిపూట నిద్రను ప్రభావితం చేస్తుంది. కాబట్టి మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోకుండా ఉండటం చాలా ముఖ్యం. ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల స్ట్రోక్ ముప్పు 20 శాతం కంటే ఎక్కువ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్నం 90 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోయే వారికి పక్షవాతం వచ్చే ప్రమాదం 25 శాతం ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఎక్కువసేపు నిద్రపోవడం మంచి అలవాటు కాదని, కానీ నిద్ర లేకపోవడం వల్ల కూడా సమస్యలు ఉంటాయంటున్నారు. కొందరు రాత్రి సమయంలో ఎక్కువ సేపు పడుకోరు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. తగినంత నిద్ర లేకపోవడం వల్ల మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, ఊబకాయం, డిప్రెషన్‌కు కారణమవుతాయి. అందుకే మనం ప్రతిరోజూ తగినంత నిద్రపోవడానికి ప్రయత్నించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Read Also: లెమన్ టీతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
Follow us on: Youtube , Instagram