స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక సీఎం ఎంపికపై ఏర్పడిన గందరగోళానికి ఎట్టకేలకు తెరపడింది. సీఎంగా సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య వైపే కాంగ్రెస్ అదిష్ఠానం ఓటు వేసింది. సీఎం పదవి కోసం తీవ్రంగా పోటీపడిన పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు అంగీకరించినట్లు తెలిపారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పార్టీ విశాల ప్రయోజనాల కోసం తాను ఈ ఫార్ములాను అంగీకరించానని డీకే పేర్కొన్నారు.
రాష్ట్రానికి సేవ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు తనపై ఉందని.. తామంతా ఐకమత్యంగా మంచి పాలన అందించాలని చెప్పారు. కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈనెల 20న బెంగళూరులో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం 7గంటలకు క్వీన్స్ రోడ్‌లోని ఇందిరా గాంధీ భవన్‌లో జరిగే శాసనసభా పక్ష సమావేశానికి హాజరు కావాలని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు డీకే లేఖలు రాశారు.
అయితే తొలి రెండేళ్లు సిద్ధరామయ్య, తర్వాత మూడేళ్లు శివకుమార్ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు వెల్లడిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల అనంతరం దీనిపై అధికారికంగా అధిష్టానం ప్రకటన చేస్తోందని భావిస్తున్నారు.