తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు బృందం నలుగురిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.
ఉత్తరాఖండ్ లోని రూర్కీలో ఉన్న భోలే బాబా డెయిరీకి అప్పట్లో డైరెక్టర్లుగా పనిచేసిన విపిన్ జైన్, పోమిల్ జైన్ ను అరెస్టు చేశారు. అలాగే పూనంబాకలోని వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావ్డా, తమిళనాడు దుండిగల్ లోని ఏఆర్ డెయిరీ ఎండి రాజు రాజశేఖరన్ లను దర్యాప్తు బృందం అరెస్టు చేసింది.
క్రై నెంబర్ 470/24లో అరెస్టు చేసి తిరుపతి కోర్టులో హాజరుపరిచారు. సీబీఐ దర్యాప్తులో డెయిరీలు చేసిన అక్రమాలు బట్టబయలయ్యాయి. నెయ్యి సరఫరా పేరులో అడుగడుగునా ఉల్లంఘనలకు పాల్పడినట్టు తేలింది.
తక్కువ ధరకి సరఫరా ఎలా సాధ్యం..?
మార్కెట్ లో నెయ్యి ధర రూ.500 కు తక్కువగా లేదు. మరి రూ.320 రూపాయలకే టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తామని తమిళనాడు దుండిగల్ లోని ఏఆర్ డెయిరీ ఎలా ఒప్పందం చేసుకుంది… దీనిపైనే దర్యాప్తు బృందం ఫోకస్ చేసింది. తీగ లాగితే డొంక కదిలింది.
ఎఆర్ డెయిరీ పేరుతో నెయ్యి సరఫరా టెండర్లను వైష్ణవి డెయిరీ ప్రతినిధులు దక్కించుకున్నారు. ఎఆర్ డైయిరీ పేరు ముందు పెట్టి తప్పుడు డాక్యుమెంట్లు, సీళ్లు ఉపయోగించి వైష్ణవి డెయిరీ టెండర్ కథ నడిపించినట్టు తెలుస్తోంది. రూర్కీలోని భోలే బాబా డెయిరీ నుంచి నెయ్యి తెప్పించినట్లు వైష్ణవి డెయిరీ దొంగ రికార్డులు సృష్టించింది. అయితే భోలే బాబా డెయిరీకి ఇంత మొత్తంలో నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదని అధికారుల విచారణలో తేలింది. ఆ సంస్థ మిగిలిన చోట్ల నెయ్యిని సేకరించి సరఫరా చేసిందని నిర్ధారించింది. సమగ్ర విచారణతో అక్రమాలను గుర్తించిన దర్యాప్తు బృందం..మూడు డెయిరీలకు చెందిన నలుగురిని అరెస్టు చేశారు.
అసలేం జరిగింది?
వైసీపీ హయాంలో తమిళనాడు దుండిగల్ లోని ఏఆర్ డెయిరీకి టెండర్లు కట్టబెట్టారు. రూ.319.80కి కిలో చొప్పున 10 లక్షల కిలోల నెయ్యి సరఫరాకు టీటీడీ అధికారులతో అగ్రిమెంట్ చేసుకున్నారు. గతేడాది జూన్ నుంచి ఆ సంస్థ నెయ్యి సరఫరా మొదలుపెట్టింది. జులై 6, 17 తేదీల్లో పంపించిన నాలుగు ట్యాంకర్లలోని నెయ్యి నాణ్యత సరిగ్గా లేదని, కల్తీ జరిగిందని తిరుమల దేవస్థానం గుర్తించింది. వాటిని పరీక్షించేందుకు గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ కాఫ్ ల్యాబ్‌కు పంపించింది.
ఆ శాంపిళ్లలో జంతువుల కొవ్వు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దీనిపై విచారణకు తొలుత రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసింది. తర్వాత గత అక్టోబర్‌లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ పోలీసు శాఖ నుంచి ఇద్దరు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒకరితో బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సిట్ విచారణ జరిపి ప్రస్తుతానికి నలుగురిని అరెస్ట్ చేసింది.