నూతన పీసీసీ కార్యవర్గాన్ని రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎంసీహెచ్‌ఆర్డీలో సీఎల్పీ సమావేశం జరిగింది. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశాల పై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చారు.
అనంతరం మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా సమావేశం జరిగిందని అన్నారు. సూర్యాపేటలో భారీ బహిరంగ సభ నిర్వహిసస్తామని. ఈ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానిస్తామని చెప్పారు. మెదక్‌లో జరిగే మరో బహిరంగ సభకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ఆహ్వానిస్తామని తెలిపారు.
” దేశ చరిత్రలో మొదటిసారిగా తెలంగాణలో కులగణన పూర్తి చేశాం. బీసీ సంఘాలని, బీసీ ప్రజలను బీఆర్ఎస్ తప్పు దోవ పట్టిస్తుంది. మా శాసన సభ్యులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశా నిర్దేశం చేశాం. ఎస్సీ వర్గీకరణ అంశంపై కూడా ఇదే విషయం చెప్పాం. దాదాపు 5 గంటలపాటు సీఎల్పీ సమావేశం జరిగింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డిప్యూటీ సీఎం వివరించారు. కులగణన చేసిన తీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాం.
అవాస్తవాలు ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాల నోళ్ళు మూయించే విధంగా ముందుకు వెళ్తాం. జిల్లా ఇన్చార్జిలు ఈ విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తారు. స్థానిక సంస్థలు, పార్టీ బలోపేతంపై మాత్రమే చర్చ జరిగింది.
ఎమ్మెల్యేలకు ఉన్న అనుమానాలు నివృత్తి చేశాము. బీసీ కులగణన విజయవంతం కావడం పట్ల సూర్యాపేటలో బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. ఎస్సీ వర్గీకరణ విజయంపై ఉమ్మడి మెదక్ జిల్లాలో బహిరంగ సభ నిర్వహిస్తాం. ఢిల్లీకి వెళ్లి రాహుల్, ఖర్గేలను ఆహ్వానిస్తాం”.. అని మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు.
ఎమ్మెల్యేల రహస్య సమావేశంపై మాట్లాడిన పీసీసీ చీఫ్.. డిన్నర్ భేటీ కావడంలో తప్పు లేదన్నారు. కేసీఆర్, కేటీఆర్ ప్రజల తిరస్కరణకు గురైన నేతలని.. బీజేపీతో లోపాయకారి బంధాన్ని బలోపేతం చేసుకునేందుకే ఢిల్లీకి వెళ్లినట్టు అనుమానంగా ఉందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.