సంధ్య థియేటర్‌లో తొక్కిసలాటతో సినీ ఇండస్ట్రీ, సర్కార్ మధ్య గ్యాప్ ఏర్పడింది. గ్యాప్‌ని పూడ్చే పనిలో దిల్ రాజు పడ్డారు. సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు రేపు భేటీ కానున్నారు. ఇద్దరి మధ్య వారధిలా FDC ఛైర్మన్ దిల్ రాజు వ్యవహరించనున్నారు. భేటీ తర్వాత సంధ్య థియేటర్ ఘటన కొలిక్కి రానుందా…? అల్లు అర్జున్ ఇష్యూ గురించి మాట్లాడతారా…? సమావేశంతో గ్యాప్ క్లియర్ అవుతుందా…?
ఈ ఏడాది ఎన్నో సినిమాలు వచ్చాయి… ఎందరో స్టార్ హిరీలో సక్సెస్ కొట్టినా… ఆ రికార్డులను… ఆ కలెక్షన్లని బద్దలు కొట్టి సరికొత్త ట్రెండ్ సెట్ చేశాడు అల్లు అర్జున్. కేవలం కలెక్షన్లతోనే కాదు కాంట్రవర్సీతోనూ అంతకుమించిన న్యూస్ మేకర్ అయ్యాడు బన్నీ. పుష్ప సినిమా సక్సెస్‌తో సీక్వెల్‌గా పుష్ప 2 సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 5న రిలీజ్ అయింది. బెన్‌ఫిట్ షోలతో పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు పుష్ప మేకర్స్ అడిగిన వెంటనే సర్కార్ అనుమతులు ఇచ్చింది. అలా ఒక రోజు ముందుగానే రిలీజ్ అయి కలెక్షన్లతో షేక్ చేస్తుందనుకుంటే… న్యూసెన్స్‌తో దేశాన్ని షేక్ చేసింది పుష్పా 2.
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట అనంతర పరిణామాలు అటు ప్రభుత్వానికి… ఇటు ఇండస్ట్రీకి మధ్య గ్యాప్ పెంచుతూ వచ్చాయి. పెద్ద ఇష్యూ కాదనుకున్న కేసు ఏకంగా బన్నీని జైలుకు పంపేలా చేసింది. అండర్ ట్రయల్ ప్రిజనర్ గా ఒకరోజు జైల్లో ఉండాల్సి వచ్చింది. బన్ని విషయంలో ప్రభుత్వం క్రూయల్‌గా బిహేవ్ చేస్తోందని కొందరు సినీ ప్రముఖులు… అల్లు ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. సినీ ఇండస్ట్రీపై కాంగ్రెస్ ప్రభుత్వం కాలు దువ్వుతోందని ఇటు ప్రతిపక్షాలు సైతం ఆక్షేపించాయి. ఇది చాలదన్నట్లు సినీ ఇండస్ట్రీ ఏపీకి రావాలంటూ అక్కడి అమాత్య ఒకరు మీడియాతో మాట్లాడటంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇలా ఒకదాని వెంట ఒకటి జరుగుతున్నా… అటు సినీ ఇండస్ట్రీ నుంచి కానీ ఇటు ప్రభుత్వం నుంచి కానీ మధ్యవర్తిత్వం వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
ఓ వైపు ప్రభుత్వానికి… సినీ ఇండస్ట్రీకి రిలేషన్ దెబ్బతింటోన్న తరుణంలో అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో బన్ని విషయం కాస్త చినికి చినికి గాలివానలా మారింది. తొక్కిసలాట జరిగిందన్న విషయాన్ని అల్లు అర్జున్‌కి చెప్పేందుకు థియేటర్ యాజమాన్యం కానీ… ఆయన పీఏలు గాని అనుమతించలేదని అసెంబ్లీ సాక్షిగా థియేటర్ వద్ద ఏం జరిగిందో పూస గుచ్చినట్లు సభ్యులకి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలను లైట్ తీసుకోకుండా… అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు తెలిపారు. లాయర్ల టీం చెప్పిన విషయాల వరకు మీడియాతో చెప్పి వెళ్లిపోయి ఉంటే గొడవ అక్కడితో సద్దుమణిగేదే కానీ… బన్నీ అలా చేయలేదు.
అల్లు అర్జున్ విమర్శలు, ప్రెస్ మీట్‌లో ఆయన చేసిన కొన్ని చర్యలతో క్లోజ్ అయ్యే గొడవకు పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు అయింది. ఓ ప్రెస్ మీట్‌లో రేవంత్ రెడ్డి పేరును మర్చిపోవడంతోనే అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారని కేటీఆర్ చెప్పారు. మళ్లీ ప్రెస్ మీట్‌లో నీళ్లు తాగే సమయంలో ఆయన చేసిన వింత చేష్ట మరోసారి చర్చకు దారి తీసింది. ఇదే కాక తన వద్దకు పోలీస్ అధికారులు ఎవరూ రాలేదంటూ చెప్పిన స్టేట్‌మెంట్‌కి కౌంటర్‌గా సంధ్య థియేటర్ సీసీ ఫుటేజీని పోలీసులు బహీర్గతం చేశారు. ఇక సైలెంట్ అయితోనే బెటర్ అనుకున్న అల్లు ఫ్యామిలీ… తమ ఇంటిపై దాడికి పాల్పడినా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
సంధ్య థియేటర్ ఇష్యూకి సినీ పెద్దలతోనే పులిస్టాప్ పెట్టాలని అల్లు ఫ్యామిలీ భావించినట్లు ఉంది. ఆ మరుసటి రోజే శ్రీ తేజను పరామర్శించేందుకు కొందరు సినీ పెద్దలను ఆస్పత్రికి పంపించారు. ఇక అమెరికాలో ఉన్న దిల్ రాజు హైదరాబాద్‌కి చేరుకున్న వెంటనే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడమే కాకుండా… శ్రీ తేజ ఫ్యామిలీకి భరోసా కల్పించారు. సినీ పరిశ్రమ, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉండేందుకే FDC ఛైర్మన్ పదవిని తనకు సీఎం ఇచ్చారని గుర్తుచేశారు. తెలుగు సినిమా పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వంకు మధ్య వారధిగా ఉండి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. సినీ పెద్దలందరినీ తీసుకెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని రేపు దిల్ రాజు కలవనున్నారు. ఆ భేటీతో సినీ పరిశ్రమ, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఏర్పడిన అంతరం తొలిగిపోతుందేమో చూడాలి. బెన్‌ఫిట్‌షోలపైనా ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.