స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ రాస్తారం ఒకవైపు ఎండలతో భగ్గుమంటూనే.. మరోవైపు అకస్మాత్తుగా చల్లబడుతుంది. నిన్న మధ్యాహ్నం దాకా భానుడి భగభగలతో, వేడి సెగలు పుట్టడంతో ప్రజలు అల్లాడారు. నల్గొండ జిల్లా నిడమనూరులో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఖమ్మం, రంగారెడ్డిలో 40.3 డిగ్రీలు, జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా 39.4 డిగ్రీల సెల్సియస్ పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంతలో వాతాహవరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు కొముర్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసాయి.
ఇక రాగల ఐదు రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి ఏర్పడినట్లు వాతావరణశాఖ పేర్కొంది. దీంతో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే సూచనలున్నాయని చెప్పింది. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇక మరికొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు నమోదవుతాయని కూడా పేర్కొంది.