ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul gandi) నివాసానికి పెద్ద సంఖ్యలో పోలీసులు రావడంపై ఆ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra)లో ప్రస్తావించిన లైంగిక వేధింపుల బాధితుల వివరాలు ఇవ్వాలని కోరడంపై మండిపడింది. దేశంలో లక్షలాది మంది మహిళలు స్వేచ్ఛగా సంచరించేందుకు, తమ బాధలను పంచుకోవడానికి జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ అవకాశం కల్పించినట్లు తెలిపింది. పార్లమెంట్ లో అదానీ(Adhani)పై తాము సంధిస్తున్న ప్రశ్నలతో ప్రధాని మోదీ(Modi) ఎంతగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారో ఢిల్లీ పోలీసుల చౌకబారు నాటకాలే రుజువు చేస్తున్నాయని దుయ్యబట్టింది.
కాగా జనవరి 30న శ్రీనగర్ లో జోడో యాత్ర ముగింపు సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ ఇప్పటికీ దేశంలో మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ యాత్రలో తనను ఇద్దరు మహిళలు కలిసి తమపై సామూహిక అత్యాచారం జరిగిందని తెలిపారన్నారు. దీంతో ఆ బాధిత మహిళల వివరాలను తమకు తెలియజేయాలని రాహుల్ గాంధీని పోలీసులు కోరారు. త్వరలో సమాచారం ఇస్తానని రాహుల్ చెప్పడంతో పోలీసులు ఆయన నివాసం నుంచి వెనుదిరిగారు.