జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్‌లు రసవత్తరంగా జరుగుతున్నాయి. ప్లే ఆఫ్స్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన జట్లు అమీతుమీ తెల్చుకుంటున్నాయి. రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఢిల్లీ, లక్నో మ్యాచ్ అభిమాలను ఉర్రూతలూగించాయి. ప్లే ఆఫ్ అవకాశా లను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠభరిత విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్‌పై 19 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసి ఢిల్లీ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో విఫలం అయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్ (58), స్టబ్స్ (57) టాప్ స్కోరర్లుగా ఉన్నారు. మిగతా బ్యాటర్లు కూడా సమష్ఠిగా రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్ హుల్ హక్ 2 వికెట్లు, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీశారు. లక్నో సూపర్ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించడంతో రాజస్థాన్ రాయల్స్ అధికా రికంగా ప్లే ఆఫ్స్‌కి అర్హత సాధించింది. రాజస్థాన్ రాయల్స్ ఖాతాలో ఇప్పటికే 16 పాయింట్లు ఉండడంతో అర్హత సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మినహా ఇతర జట్లేవీ 16 పాయింట్లు సాధించే అవకాశం లేకపోవడంతో రాజస్థాన్‌కు మార్గం సుగుమం అయ్యింది. రాజస్థాన్‌కు మిగిలివున్న రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయినా ఆ జట్టుపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఇక తాజా గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండగా.. మైనస్ రన్‌రేట్ కలిగివున్న లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది.