స్వతంత్ర వెబ్ డెస్క్: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వ కీలక పురోగతి సాధించింది. పాలమూరు(Palamuru) జిల్లా వాసుల దశాబ్దాల కలను సాకారం చేసే తీపి కబురు కేంద్రం నుంచి అందింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి(upliftment scheme) పర్యావరణ అనుమతులు మంజూరయ్యాయి. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ పరిధిలోని ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ (Expert Appraisal Committee) కేంద్ర జల్‌శక్తిశాఖకు సిఫారసు చేసింది. దీంతో అనుమతుల మంజూరు లాంఛనం కానుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం చాలాకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈఏసీ సభ్యులు రకరకాల సందేహాలను లేవనెత్తుతుండటంతో అనుమతుల్ని వాయిదా వేస్తూ వచ్చారు.
నెరవేరిన దశాబ్దాల కల.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు
ఒక దశలో ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులను తిరస్కరించి ప్రాజెక్టు ప్రతిపాదనలను పక్కన పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం పట్టువిడవకుండా ఈఏసీ కోరిన విధంగా సమగ్రంగా ప్రాజెక్టు వివరాలను సమర్పించింది. దీంతో ఎట్టకేలకు ఈ ఏడాది జూన్ 27న నిర్వహించిన ఈఏసీ(Eac) 48వ సమావేశంలోనే పాలమూరు ప్రాజెక్టు ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత కూడా ఈఏసీ సభ్యులు పలు అంశాలపై పూర్తి వివరాలను ఇవ్వాలని కోరుతూ అనుమతుల మంజూరును పెండింగ్‌లో పెట్టారు.
గత నెల 24న నిర్వహించిన 49వ ఈఏసీలో మరోసారి తెలంగాణ సర్కారు తరఫున తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ వాదనలు వినిపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ ఆవశ్యకతను బలంగా నొక్కి చెప్పారు. ప్రాజెక్టుకు త్వరితగతిన పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని, కరువు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చాలని ఈఏసీకి తెలంగాణ సర్కారు గతంలో విజ్ఞప్తి చేసింది. మరోవైపు ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ అంచనాలను సమర్పించాలని ఈఏసీ గతంలో తెలంగాణకు సూచించింది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఇరిగేషన్ అధికారులు పర్యావరణ ప్రభావానికి సంబంధించిన నివేదికలను ఈఏసీకి అందజేశారు. వాటన్నింటిపై సంతృప్తి వ్యక్తం చేసిన ఈఏసీ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్రానికి సిఫారసు చేసింది.
Latest Articles
- Advertisement -