స్వతంత్ర, వెబ్ డెస్క్: అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపోర్ జాయ్’ తుపాను మరో 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుందని భారత వాతావరణశాఖ తెలిపింది. వచ్చే 3 రోజుల్లో ఉత్తర-పశ్చిమ దిశగా తుపాను కదలనుందని.. ప్రస్తుతం అది గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు 600 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొంది. ప్రస్తుత అంచనాల ప్రకారం గుజరాత్‌ను తాకకపోవచ్చు కానీ రానున్న 5 రోజుల్లో ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయంది. దీంతో అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీచేసింది.
తుపాను ప్రభావంతో కర్ణాటక, గోవా, మహారాష్ట్రల్లోని తీర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడతాయని వివరించింది. వర్షాలతో పాటు బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని చెప్పింది. బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది. అదేవిధంగా కర్ణాటక- మహారాష్ర్ట సరిహద్దులోని తెలంగాణ ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా తీర ప్రాంతాలకు జాతీయ విపత్తుదళ బృందాలను సిద్ధం చేశారు.