తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర సభతో కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల శంఖం పూరించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడలోనే కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిం చింది. ఈ సభలోనే ఆరు గ్యారంటీలను ప్రకటించి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో తుక్కుగూడ సెంటిమెంట్ ను లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగించాలని హస్తం పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తుక్కుగూడలో బహిరంగ సభ నిర్వహించి సార్వత్రిక ఎన్నికల శంఖం పూరించింది హస్తం పార్టీ.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం జోరు మీద ఉంది. ఇదే ఉత్సాహాన్ని లోక్‌సభ ఎన్నికల్లో నూ కొనసాగించాలని కాంగ్రెస్ వాదులు భావిస్తున్నారు. ఇందుకు తుక్కుగూడ బహిరంగ సభ దోహదపడుతుందని ఆశిస్తున్నారు. తుక్కుగూడ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన అగ్ర నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధికారం లోకి వస్తే అమలు చేసే ఐదు గ్యారంటీల గురించి తెలంగాణ ప్రజలకు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న విషయాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. పనిలోపనిగా తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక గులాబీ పార్టీ కీలక నేతలు ఉన్నారన్నారు రాహుల్. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్‌ను ప్రస్తావించడం ద్వారా భారత్ రాష్ట్రసమితిని ఇరుకున పెట్టారు రాహుల్ గాంధీ. అలాగే దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఎలెక్టోరల్ బాండ్లను కూడా రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. భారతీయ జనతా పార్టీ అవినీతికి ఎలెక్టోరల్ బాండ్లు ప్రతీకగా మారాయన్నారు. ఈ సందర్బంగా కమలం పార్టీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు చేశారు.
తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13న పోలింగ్ జరగబోతోంది. ఈ ఎన్నికల్లో 14 సెగ్మెంట్లను టార్గెట్‌గా పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. తుక్కుగూడ బహిరంగ సభ ప్రభావం తెలంగాణ వ్యాప్తంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు. తుక్కుగూడ బహిరంగ సభను విజయ వంతం చేసి రాష్ట్రంలోని విపక్షాలైన భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలకు కాంగ్రెస్ పార్టీ సవాల్ విసిరింది. దాదాపు నాలుగు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జోరు మీదుంది.లోక్‌సభ ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లను గెలుచుకుంటామన్న ధీమా కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. అంతేకాదు….ఇటీవల గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున వలసలు ప్రారంభమయ్యాయి. నిన్నమొన్నటివరకు గులాబీ పార్టీలో అగ్రనేతలుగా ఉన్న కే.కేశవరావు, కడియం శ్రీహారి లాంటి వారు …ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అలాగే వరంగల్ నియోజ కవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున అభ్యర్థినిగా ఖరారైన డాక్టర్ కడియం కావ్య చివరిక్షణంలో తాను పోటీ చేయడం లేదని ప్రకటిం చారు. దీంతో గులాబీ పార్టీ షాక్‌కు గురైంది. ఈ పరిణామాలన్నీ భారత్ రాష్ట్ర సమితి ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. పరిస్థితి ఇప్పుడు ఇలా ఉంటే, లోక్‌సభ ఎన్నికలు ముగిసేసరికి బీఆర్‌ఎస్‌లో ఎవరు ఉంటారో, ఎవరు పార్టీకి గుడ్ బై చెబుతారోనని రాజకీయవర్గాల్లో ఇప్పటికే చర్చ మొదలైంది. అయితే ఇదంతా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్‌గా మారుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇదిలాఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లోక్‌సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి హోదాలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలుపు తీరాలకు చేర్చి పార్టీ అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డి మంచి మార్కులు కొట్టేశారు. అయితే నాలుగు నెలలు కూడా తిరక్క ముందే లోక్‌సభ ఎన్నికలు వచ్చేశాయి. లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిపించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిపై పడింది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు టార్గెట్‌గా పెట్టు కుంది భారతీయ జనతా పార్టీ. ఈ నేపథ్యంలో తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీంతో భారతీయ జనతా పార్టీ నుంచి ప్రతిఘటన ఎదుర్కోవలసిన పరిస్థితి కాంగ్రెస్‌కు నెలకొంది.2009 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో అనూహ్యంగా నాలుగు సీట్లు గెలుచుకుంది. దీంతో ఈసారి మొత్తం 17 సీట్లను టార్గెట్ గా పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ. సారే కే సారా … సత్రా హమారా… అనే నినాదంతో బీజేపీ ముందుకెళుతోంది. ఇందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని కమలం పార్టీ ఉధృతం చేసింది.
లోక్‌సభ ఎన్నికల్లో విజయం కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది భారతీయ జనతా పార్టీ. ఇందులో భాగంగా ఎన్నికల మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. పోలింగ్ బూత్‌లే కేంద్రంగా కార్యాచ రణను అమలు చేస్తోంది. మొత్తం 17 లోక్‌సభ సెగ్మెంట్లు, వాటి పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజ కవర్గా ల్లోని పోలింగ్ బూత్‌లే కేంద్రంగా క్షేత్ర స్థాయి నుంచి పని విధానాన్ని ఖరారు చేసింది. ఇందుకోసం రాష్ట్రం లోని ప్రతి పోలింగ్ కేంద్రానికి అనుబంధంగా ఒక వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని నిర్ణయిం చింది. అలాగే గత పదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకె ళ్లాలని స్థానిక నేతలకు బీజేపీ అగ్రనాయకత్వం దిశా నిర్దేశం చేసింది. దీంతోపాటు మహిళలను ఆకట్టు కోవడానికి చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు, ముస్లిం ఆడపడుచుల కన్నీళ్లు తుడవడానికి ఉద్దేశించిన ట్రిపుల్ తలాక్ రద్దు వంటి అంశాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని స్థానిక నేతలను పార్టీ హై కమాండ్ ఆదేశించింది.
తెలంగాణలో ఇటు కాంగ్రెస్, అటు గులాబీ పార్టీ కంటే ముందుగా అభ్యర్థులను ఖరారు చేసింది బీజేపీ. అలాగే తొలివిడత ప్రచారంలోనూ కమలం పార్టీయే ముందుంది. ఈ నేపథ్యంలో ఇదే జోష్‌ను భవిష్యత్తులోనూ కొనసాగించాలని తెలంగాణ కమలనాథులు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా నాయకలు, కార్యకర్తల మధ్య సమన్వయం, ఇతర పార్టీల నుంచి చేరికలు, పోలింగ్ బూత్ స్థాయి వరకు పార్టీ కార్యక్రమాల వికేంద్రీకరణపై కమలనాథులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేశారు. మరో విడతలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు పర్యటించనున్నారు. ఏమై నా తెలంగాణలో ఈసారి లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా జరగబోతున్నాయంటున్నారు రాజ కీయ విశ్లేషకులు.


