బల్దియాలో మరో బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్స్ స్కాం బయటపడింది. నాన్ అవెలబులిటి సర్టిఫికెట్ లేకుండానే బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లను ఫలక్‌నుమా సర్కిల్ అధికారులు జారీ చేశారు. నాన్ అవెలబులిటి సమాచారం రికార్డులలో లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతేడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఇదే సర్కిల్ నుంచి 80 సర్టిఫికెట్స్ జారీ అయినట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్, సికిం ద్రాబాద్, చార్మినార్, గోషామహల్ సర్కిల్స్‌లోనూ ఇదే తీరు కనిపిస్తోంది. 1998లో జన్మించిన వ్యక్తికి నవంబర్‌లో నాన్ అవెలబూలిటి కింద సర్టిఫికెట్ జారీ అయ్యింది. ఈ సర్టిఫికెట్లను ఆధార్, ఓటర్ ఐడీ, పాస్ పోర్ట్, లాండ్ రిజిస్ట్రేషన్‌లకు ఘరానా మోసగాళ్లు వాడుతున్నట్లు బయటపడింది. గత కమిషనర్ లోకేష్ కుమార్ హయాంలో దాదాపు 36 వేల ఫేక్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్స్ రద్దు అయ్యాయి. ఇప్పటి వరకు దానిపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో కేటుగాళ్లు రెచ్చిపోయారు.
ఉన్నతాధికారుల అండదండలతోనే ఈ దందా నడుస్తున్నట్లు తెలుస్తోంది. సమస్యను బట్టి డబ్బులు వసూలు చేయడం జరుగుతోంది. ఒక్కో సర్కిల్ నుండి 3 లక్షలు, ఆదాయం ఎక్కువ ఉన్న సర్కిల్‌లో ఐదు లక్షలు నెలసరి ఆదాయం వసూలు అవుతున్న పరిస్థితి. సర్కిల్‌లో ఏఎంఓహెచ్ లేని చోట డిప్యూటీ ఈఈలను అధికారులు నియమించారు. అయితే ఇలాంటి ప్లేస్‌లో ఏఎంసీ, రిజిస్ట్రార్‌లు బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్స్ జారీ చేశారు. సీఎంఓ హెచ్‌పై ఇప్పటికే తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆమె దగ్గర పని చేస్తున్న మహిళా ఉద్యోగులు సీఎమ్‌ఓ హెచ్ తమను వేధిస్తున్నారని మేయర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. మొన్ననే నకిలీ ఫింగర్ ప్రింట్స్‌తో 84 లక్షల రూపాయ లను కాజేసిన కేటుగాళ్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.