దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,823 మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. నిన్నటితో పోల్చితే 27శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి. మొత్తం 1,33,153 నమూనాలను పరీక్షించగా.. 3,823 మందికి వైరస్ నిర్దారణ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 1,784 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం కరోనా రికవరీల రేటు 98.72శాతంగా ఉంది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 18,369కి చేరింది. ఢిల్లీలో ఏడు నెలల తర్వాత అత్యధిక కేసులు నమోదయ్యాయి. 416 మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. మహారాష్ట్రలోనూ 669 కొత్త కేసులు వెలుగుచూడగా.. ఇందులో ఒక్క ముంబయి నుంచే 347 కేసులు నమోదవ్వడం పరిస్థితికి అద్ధం పడుతోంది.