ఇంత కాలం సీనియారిటి, సర్వేలు, సిన్సియారిటి అని చెప్పిన హస్తం..లోక్ సభ ఎన్నికల వేళ రూట్ మార్చింది. కొత్తగా పార్టీలో చేరిన నేతలకూ టికెట్లు కట్టబెడుతోంది. వలస నేతలకు ప్రాధాన్యత దక్కడం పట్ల ఇంతకాలం పార్టీకి సేవ చేసిన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా…హస్తం పెద్దలు పట్టించుకోవడం లేదనే ప్రచారం జరుగుతోంది.
లోక్ సభ ఎన్నికల షెడ్యుల్ విడుదల కావడంతో..హస్తం పార్టీలో టికెట్ల కేటాయింపు ఊపందుకుంది. ఇప్పటికే మొదటి జాబితా విడుదల చేసిన అధిష్టానం మలి జాబితాపై కసరత్తు చేస్తోంది. ఢిల్లీలో అభ్యర్ధుల ఎంపికపై వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇవాళో రేపో రెండో జాబితా విడుదల చేస్తారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పటికే ప్రకటించిన తెలంగాణలోని నాలుగు స్థానాలను పార్టీ నేతలకే కట్టబెట్టారు. మహబూబా బాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ , జహీరాబాద్ నుంచి మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, నల్గొండ నుంచి జానా రెడ్డి తనయుడు రఘువీర్‌కు టికెట్లు ప్రకటించింది. పెద్దపల్లి సీటును చెన్నురు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు వంశీ, నాగరకర్నూలు సీటును మాజీ ఎంపీ మల్లు రవికి కేటాయించినా ఇంకా ప్రకటన చేయలేదు. నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బరిలో దించాలని భావిస్తోంది.
ఇక మిగిలిన స్థానాలకు సైతం అభ్యర్ధులను ఖరారు చేసింది అధిష్టానం. కాని ఇందులో ఎక్కువ స్థానాలను పక్క పార్టీ నుంచి వచ్చిన నేతలకు కేటాయిస్తుంది . సీనియారిటి, లాయలిటి అని గతంలో చెప్పిన అంశాలను పక్కన పెట్టి..అన్ని రకాలుగా బీజేపీ, బీఆర్ఎస్ ను ఎదుర్కోనే నేతలకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా సికింద్రాబాద్ సీటును బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు, చేవెళ్ల టికెట్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రజింత్ రెడ్డి, మల్కాజిగిరి స్థానాన్ని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పట్నం సునితా రెడ్డికి కేటాయించాలని హస్తం పార్టీ డిసైడ్ అయ్యింది. ఇక వరంగల్ స్థానాన్ని సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ కు కేటాయించే అవకాశాలున్నాయి. భువనగరి ఎంపీ స్థానం కోసం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పేరు పరిశీలనలో ఉంది.
అయితే అధికార పార్టీ కాంగ్రెస్ పక్క పార్టీ నుంచి వచ్చిన నేతలకు ఎందుకు ఎంపీ టికెట్లు ఇస్తుందో ఆ పార్టీ నేతలకే అంతు చిక్కడం లేదు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం టికెట్లు త్యాగం చేసి పనిచేసిన నేతలకు కాకుండా…..కొత్త వారికి ఎంపీలుగా అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే సునిల్ కనుగోలు సర్వేల్లో గెలుపు అవకాశాలు అధికంగా ఉన్న నేతలకే టికెట్లు ఇస్తున్నారని..పాత, కొత్త అనడం సరికాదంటున్నారు సీనియర్లు. తెలంగాణలో కనీసం 14 స్థానాలను గెలుచుకోవాలంటే కొన్ని సీట్లను వలస వచ్చిన నేతలకు కేటాయించడంలో తప్పు లేదంటున్నారు హస్తం పెద్దలు.