మహారాష్ట్ర రాజకీయ చిత్రం మహా గందరగోళం లా కన్పిస్తోంది. మహారాష్ట్ర హుందా రాజకీయాలకు ఒకప్పుడు పెట్టింది పేరు. రాష్ట్రంలో సీఎంగా పనిచేసిన ఎందరో. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర వహించారు. కేంద్రంలో ప్రధాని, డిప్యూటీ ప్రధాని, కేంద్ర కీలక మంత్రి పదవులు అలంకరించారు. ప్రస్తుతం శివసేన, ఎన్సీపీ వంటి పార్టీలు చీలి లోక్ సభ ఎన్నికలవేళ ఆరుపార్టీలు , మూడు కూటములు గా రాజకీయం తయారైంది. తమ ఉనికిని కాపాడుకు నేందుకు అన్నిపార్టీలు నానా తంటాలు పడుతు న్నాయి. మరోవైపు పార్టీ గుర్తు గడియారం కోసం అజిత్ పవార్ వర్గం, శరద్ పవార్ వర్గం కోర్టులో కొట్లాడుతున్నాయి. ఎన్నికల్లో ప్రజలు ఎవరిని సిసలైన పార్టీగా ప్రకటిస్తారో చూద్దాం.
మన దేశ రాజకీయాల్లో మహారాష్ట్రకు ఒక ప్రత్యేకత ఉంది. ఉత్తరప్రదేశ్ తరువాత అత్యధిక లోక్‌సభ సీట్లున్నది ఒక్క మహారాష్ట్రలోనే. ఇక్కడ మొత్తం 48 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. మహారాష్ట్ర లో ఈసారి లోక్‌సభ ఎన్నికలు ఐదు విడతల్లో జరుగుతాయి. ఇప్పటివరకు రెండు విడతల్లో పోలింగ్ జరిగింది. మూడో విడత పోలింగ్ మే ఏడో తేదీన జరుగుతుంది. ఆ తరువాత మే 13, మే 20 తేదీల్లో పోలింగ్ నిర్వహిస్తారు. దీంతో మహారాష్ట్రలో ఎన్నికల పర్వం ముగుస్తుంది. ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయ చిత్రం మహా గందరగోళంగా కన్పిస్తోంది. సుదీర్ఘకాలంపాటు మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన రెండు పార్టీలు శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు ప్రస్తుతం చీలికలు, పేలికలుగా మారాయి. శివసేన పార్టీ ఉద్దవ్ ఠాక్రే వర్గంగానూ, ఏక్‌నాథ్ షిండే వర్గంగానూ విడిపోయింది. అలాగే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ వర్గంగానూ, అజిత్ పవార్ గ్రూప్‌గానూ విడిపోయింది.
ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాలు రెండు కూటములుగా విడిపోయాయి. ఒకవైపు ఉద్ధవ్ బాలా సాహెబ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్, శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్గం…మహావికాస్ అఘాడీ పేరుతో కూటమిగా ఏర్పడ్డాయి. మరోవైపు భారతీయ జనతా పార్టీ, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీలతో కూడిన మహా కూటమి ఏర్పడింది. ప్రస్తుతం ఈ రెండు కూటముల మధ్య హారాహోరీ పోరు నెలకొంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన కలిసి పోటీ చేశాయి. మొత్తం 48 సీట్లలో 41 సీట్లను ఈ రెండు పార్టీలు గెలుచుకున్నాయి. అయితే ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి.అధికారిక గుర్తింపు పొందిన ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని శివసేనతో కలిసి బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింది. అలాగే అటు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని చీల్చిన అజిత్ పవార్ వర్గంతోనూ బీజేపీ జత కట్టింది. అయితే ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని శివసేనకు అలాగే అజిత్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీకి సామాన్య జనంలో పెద్దగా ఆదరణ లభించడం లేదు. దీంతో మహారాష్ట్ర ఎన్నికలలో ఎన్డీయే కూటమి అతి పెద్ద పరీక్ష ఎదుర్కొంటోంది. ఇదిలా ఉంటే, రాజ్ ఠాక్రే నాయకత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన, ఇటీవల బీజేపీకి మద్దతు ప్రకటించింది. అయితే రాజ్ ఠాక్రే నిర్ణయం నచ్చని అనేక మంది మహారాష్ట్ర నవ నిర్మాణ సేన కార్యకర్తలు, నాయకులు పార్టీకి గుడ్‌బై కొట్టారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో ఈసారి మరాఠా రిజర్వేషన్లు కీలకాంశంగా మారాయి. విద్య, ఉద్యోగాల్లో అదనంగా పది శాతం మరాఠాలకు రిజర్వేషన్లు అమలు చేయడానికి ఏక్‌నాథ్ షిండే సర్కార్ బిల్లు తీసుకువచ్చింది. ఈ బిల్లును ఓబీసీలు వ్యతిరేకిస్తున్నారు. మరాఠా రిజర్వేషన్లు అమలైతే, తమ రిజర్వేషన్లకు కోత పడు తుందని ఓబీసీలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మరాఠా రిజర్వేషన్ల అంశం బొంబాయి హైకోర్టులో పెండింగ్ లో ఉంది. మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ నియోజకవర్గం యావత్ దేశ ప్రజ లందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బారామతి అంటే మరాఠా దిగ్గజం శరద్ పవార్ అడ్డా. శరద్ పవార్ పూర్వీకులు మహారాష్ట్రలోని సతారా ప్రాంత వాసులు. సతారా నుంచి పవార్ తాత ముత్తాతలు బారామతికి వచ్చి స్థిరపడ్డారు. బారామతి కార్యక్షేత్రంగా చేసుకుని శరద్ పవార్ రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.
మూడో విడతలో భాగంగా మే ఏడో తేదీన బారామతి లోక్‌సభకు పోలింగ్ జరగనుంది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో శరద్ పవార్ కుటుంబ సభ్యులే ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. ఒకవైపు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ బరిలో ఉన్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ వర్గం తరఫున సునేత్ర పవార్ పోటీలో ఉన్నారు. కొంతకాలం కిందట రూ. 25 వేల కోట్ల విలువైనకో ఆపరేటివ్ బ్యాంక్ కుంభకోణంలో సునేత్ర పవార్ చిక్కుకున్నారు. మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు లో జరిగిన కుంభకోణానికి సంబంధించిన కేసులో ముంబై పోలీసు ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు చేపట్టింది.తాజాగా ఈ కేసులో సునేత్ర పవార్‌కు ముంబై పోలీసులు క్లీన్‌చిట్ ఇచ్చారు.మరోవైపు శరద్ పవార్ బిడ్డ సుప్రియా సూలే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎస్పీ గ్రూపు నుంచి పోటీలో ఉన్నారు. 2009లో మొదటిసారి బారామతి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. లోక్‌సభలోకి అడుగుపెట్టారు. 2014లో లోక్‌సభలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకురాలిగా సుప్రియ వ్యవహరించారు. మహారాష్ట్ర లోని చురుకైనా రాజకీయ నాయకుల్లో ఒకరిగా ఆమె పేరు తెచ్చకున్నారు. మహారాష్ట్రకు చెందిన అనేక ప్రజా సమస్యలపై లోక్‌సభలో ఆమె గళమెత్తారు. శరద్ పవార్‌పై బారామతి ప్రజలకున్న అభిమానమే తనను గెలుపుతీరాలకు చేరుస్తుందంటున్నారు సుప్రియా సూలే. మొత్తంమీద బారామతి పోరు అందరినీ ఆకట్టుకుంటోంది. మరోవైపు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలు ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్నారు. సామాన్య ప్రజల్లో ఇండియా కూటమి పట్ల ఆదరణ కనిపిస్తోంది. దీంతో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇండియా కూటమి నేతలు.


