గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను ప్రజల ముందు ఉంచుతామంటూ ఎన్నికల ప్రచారంలో చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేసింది. వివిధ అంశాలపై శ్వేత పత్రాలు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే పోలవరం, అమరావతి, విద్యుత్ సహా మొత్తం8 అంశాలపై ఆయా తేదీల వారీగా వాస్తవాలను ప్రజల ముందు ఉంచనుంది. తద్వారా గత ప్రభుత్వాన్ని ఎండగట్టాలన్న వ్యూహంతో ముందు కెళుతోంది టీడీపీ కూటమి ప్రభుత్వం.
ఈ క్రమంలో మొదటిది పోలవరంపై శ్వేతపత్రం. అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు విషయంలో అసలు నాటి వైసీపీ పాలనలో ఏం జరిగింది. ఎంత మేర నిధులు ఖర్చు చేశారు. వాస్తవంలో జరిగిన పనులు ఎంత ? టీడీపీ పాలనలో జరిగిన పనులకు, వైసీపీ పాలనలో జరిగిన దానికి తేడా లేంటి అన్న వివరాలతో దీన్ని రూపొందిస్తున్నారు.రెండో శ్వేతపత్రాన్ని ప్రజా రాజధాని అమరావతిపై విడుదల చేయనుంది టీడీపీ కూటమి ప్రభుత్వం. పీపుల్స్ కేపిటల్ నిర్మాణాన్ని ఉద్దేశపూర్వకంగానే జగన్ ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం చేసింది. శాసన రాజధాని అని చెప్పి ఏ మేరకు నిధులు కేటాయించింది. ఎంత మేర ఖర్చు చేశారు. ఇలా పలు వివరాలను అమరావతిపై ఈనెల 28న విడుదల చేసే శ్వేతపత్రంలో పేర్కోనున్నారు. జులై ఒకటిని విద్యుత్‌పై, జులై నాలుగున సహజవనరుల దోపిడీ, ఇసుక, భూములు, మైనింగ్‌పై వైట్ పేపర్ రిలీజ్ చేయనుంది. మద్యం విషయంపై జులై 8న, రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో నెలకొన్న శాంతి భద్రతలపై జులై 10న, ఆర్థిక శాఖపై జులై 12న శ్వేత పత్రాలు విడుదల చేయనుంది చంద్రబాబు ప్రభు త్వం. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులకు వీటిని సిద్ధం చేసే పనిని అప్పగించింది కూటమి ప్రభు త్వం. మొత్తంగా చూస్తే వైసీపీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలను ప్రభుత్వ పరంగా ప్రజల్లోకి తీసు కెళ్లి, వారి ముందే గత పాలనను, జగన్ తీరును ఎండగట్టాలని వ్యూహాత్మకంగా టీడీపీ కూటమి ముందుకెళుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.