YSR Asara Scheme |ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘వైఎస్సార్ ఆసరా’ పథకం కింద మూడో విడత సాయాన్ని ఇవాళ విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో నిధులను జమచేయనున్నారు. వైఎస్సార్ ఆసరా పథకం కింద 78లక్షల 94 వేల మంది పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో రూ.6,419.89 కోట్ల మొత్తాన్ని వైఎస్ జగన్ జమ చేయనున్నారు. ఏలూరు జిల్లా దెందులూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
2019 సార్వత్రిక ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.25,571 కోట్ల అప్పు ఉంది. ఇప్పటికే రెండు విడతల్లో రూ.12,758.28 కోట్లను ప్రభుత్వం జమ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వరుసగా మూడో ఏడాది నగదు జమ చేయనున్నారు. ఈ మొత్తం కలిపితే మూడు విడతల్లో రూ.19,178.17 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో జమ చేసినట్లు కానుందని అధికారులు తెలిపారు.
వైఎస్సార్ ఆసరా పథకం(YSR Asara Scheme) కింద మూడో విడత సాయాన్ని విడుదల చేయనున్న సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి 78లక్షల 94 వేల మంది మహిళా లబ్ధిదారులకు లేఖలు రాశారు. మూడున్నరేళ్లలోనే 98.5 శాతం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం తమదేనని తెలిపారు.