బోర్ కొడితే టూర్ తిరగడం సాధారణంగా సామాన్యులు చేసే పని. అయితే, ప్రజా ప్రతినిధులు, పాలక పెద్దలు ప్రజాశ్రేయస్సు కోసం, అభివృద్ది, సంక్షేమం కోసం, పారిశ్రామికీకరణ కోసం, పెట్టుబడుల కోసం..అటు సెమినార్లు, సదస్సుల్లో, పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటూనే, ఉభయతారకంగా సేవలు అందిస్తుంటారు. తమ పార్టీ రాష్ట్రంలో, వేరే పార్టీ కేంద్రంలో ఉన్నప్పుడు.. ఇటు పార్టీ పెద్దలను, అటు కేంద్రంలోని అధికార పక్ష పెద్దలను కలిసి అందరితో మమేకమై అనుకున్న పనులు సాధించేందుకు ప్రయత్నాలు సాగించే వారు ఉంటారు. ఈ కోవకు చెందిన వ్యక్తిగా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. తొలుత దేశ రాజధాని పర్యటన, అనంతరం విదేశీ పర్యటనకు సీఎం రేవంత్ రెడీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారవర్గాలు ఈ వివరాలు వెల్లడించాయి.
ఢిల్లీలో ఏఐసీసీ కొత్త ప్రధాన కార్యాలయం ఇందిరా గాంధీ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం పాల్గొననున్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియాగాంధీ, ఇందిరా గాంధీ భవన్ ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి
గురువారం అధిష్ఠానం పెద్దలతో సమావేశం కానున్నారు. ఈ మీట్ లో మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పదవువ భర్తీపైనా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కలిసి, వివిధ అభివృద్ధి పనులకు నిధులు కోరే అవకాశం ఉన్నట్టు సమాచారం.
అనంతరం అదే రోజు సీఎం విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. వారం రోజులపాటు సీఎం సింగపూర్, దావోస్ టూర్ కొనసాగనుంది. జనవరి 16 నుంచి 19 వరకు సీఎం సింగపూర్ టూర్, జనవరి 20 నుంచి 22 వరకు దావోస్ టూర్ సాగనుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సుకు ఆయన హాజరుకానున్నారు. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులపై సీఎం రేవంత్ ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు పలువురు మంత్రులు, టీపీసీసీ చీఫ్ ఈ టూర్ లో పాల్గొంటున్నారు.