కాంగ్రెస్ ప్రభుత్వం ఏళ్ల తరబడి పదోన్నతులు లేని వివిధ కేటగిరీల ఉపాధ్యాయులకు తాజాగా పదోన్నతులు కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా పదోన్నతి పొందిన సుమారు 30 వేల మంది ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఎల్బీ స్టేడియంలో సమావేశం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పదోన్నతులు పొందిన 2వేల 888 మంది ఉపాధ్యాయులు ఈ సభకు తరలి వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. విద్యాశాఖ అధికారులు, ఎంఈఓలు, మండల నోడల్ అధికారులు పదోన్నతి పొందిన ఉపాధ్యాయుల జాబితాలను రూపొందించి సమావేశానికి రావాలని సూచించారు.
ఉపాధ్యాయుల సంఖ్యను బట్టి జిల్లాల వారీగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. మరోవైపు ఎల్బీనగర్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇవాళ ఉదయం నుంచి ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులు సహరించాలని సూచించారు. గురుకులాల ఉపాధ్యాయులు కూడా సమావేశానికి రానున్నారు. ఇందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో డీఈవోలు, ఇతర అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.