స్వతంత్ర డిజిటల్ : స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం నడించిందన్నారు సీఎం కేసీఆర్. అహింసమార్గంలోనే స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. గోల్కొండ కోటలో జాతీయ జెండాను అవిష్కరించారు కేసీఆర్. అనంతరం మాట్లాడిన కేసీఆర్.. గత పాలకుల చేతిలో చితికిపోయిన తెలంగాణ ఇప్పుడు.. అనేక రంగాల్లో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. తెలంగాణ ఆచరిస్తుంది. దేశం అనుసరిస్తుంది అన్నట్టుగా రాష్ట్రంలో అభివృద్థి జరుగుతుందని చెప్పారు. ప్రజల ఆశయాలకు, అవసరాలకు అనుగుణంగా బీఆర్ఎస్ పాలన సాగుతోందని చెప్పారు. రాష్ట్రం ఏర్పాడ్డాక ప్రజల కష్టాలు తొలిగించామని కేసీఆర్ చెప్పారు. ఒకప్పుడు నీటి చుక్క కోసం అలమటించిన తెలంగాణలో ఇప్పుడు జలధారాలు పారుతున్నాయన్నారు.
తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు కేసీఆర్. తొమ్మిదిన్నరేళ్ల కాలంలో రెండు దశల్లో రాష్ట్రంలోని రైతులకు దాదాపు 37 వేల కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేసిందని తెలిపారు. దేశం మొత్తం మీద రైతులను ఈ తరహాలో రుణ విముక్తులను చేసిన ప్రభుత్వం మరొకటి లేదని తాను సగర్వంగా ప్రకటిస్తున్నానమన్నారు. . రైతు సంక్షేమంలో తెలంగాణకు సాటి రాగల రాష్ట్రం దేశంలో మరొకటి లేదని స్పష్టం చేశారు.
సంపద పెంచు – ప్రజలకు పంచు అనే సదాశయంతో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా రాష్ట్రంలో పేదరికం తగ్గుతుందని, తలసరి ఆదాయం పెరుగుతున్నదని అన్నారు కేసీఆర్. జాతీయ స్థాయిలో నమోదయిన సగటు పేదరికంతో పోల్చిచూస్తే తెలంగాణలో పేదరికం అందులో మూడోవంతుగా నమోదైందని చెప్పారు. ఈ నివేదిక ప్రకారం 2015-16 నాటికి తెలంగాణలో 13.18 శాతంగా ఉన్న పేదరికం, 2019-21 నాటికి 5.88 శాతానికి దిగివచ్చిందని . అంటే, ఏకంగా 7.3 శాతం పేదరికం కనుమరుగైందని కేసీఆర్ తెలిపారు.
రైతు సంక్షేమంలో తెలంగాణ మేటి
రైతు సంక్షేమం వర్ధిల్లుతున్న రాష్ట్రంగా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. సమైక్య పాలన సృష్టించిన వ్యవసాయ సంక్షోభం నుంచి తెలంగాణను సత్వరమే బయటపడేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం వడివడిగా చర్యలు తీసుకున్నదని చెప్పారు. స్వరాష్ట్రం ఏర్పడిన మరుక్షణమే అప్పటివరకు రైతులకున్న పంట రుణాలను సంపూర్ణంగా మాఫీ చేసిందన్నారు. రెండోసారి అధికారంలోకి రాగానే మరోసారి పంటరుణాల మాఫీ చేపట్టింది. మొత్తంగా తొమ్మిదిన్నరేళ్ల కాలంలో రెండు దశల్లో రాష్ట్రంలోని రైతులకు చెందిన దాదాపు రూ.37 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసిందని చెప్పారు. దేశం మొత్తం మీద రైతులను ఈ తరహాలో రుణ విముక్తులను చేసిన ప్రభుత్వం మరొకటి లేదన్నారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. రైతు సంక్షేమంలో తెలంగాణకు సాటి రాగల రాష్ట్రం దేశంలో మరొకటి లేదని స్పష్టం చేశారు.
మిషన్ కాకతీయ, పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం, కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుతోపాటు ఇతర మధ్యతరహా, చిన్న ప్రాజెక్టుల నిర్మాణం, ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం తదితర చర్యల ద్వారా తెలంగాణ ప్రభుత్వం సాగునీటిరంగంలో స్వర్ణయుగాన్ని సృష్టించిందన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్తు, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా, రైతు బంధు, రైతు బీమా, పంట రుణాల మాఫీ తదితర సంక్షేమ చర్యలతో వ్యవసాయరంగాన్ని అద్భుతంగా స్థిరీకరించి, భారత దేశ వ్యవసాయ రంగ చరిత్రలో అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించిందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ఏలుబడిలో సాగుబడి సుసంపన్నమైందని తెలిపారు. ధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నులకు చేరుకున్నదని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో 15వ స్థానంలో ఉన్న తెలంగాణ నేడు పంజాబ్‌ను ఢీకొంటూ దేశంలోనే ప్రథమ స్థానానికి పోటీపడుతున్నదని చెప్పారు.
అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ఇంతటి ఔన్నత్యాన్ని సాధిస్తుంటే, కొంతమంది అల్పబుద్ధిని ప్రదర్శిస్తూ రైతు సంక్షేమ చర్యలకు వక్రభాష్యాలు చెబుతున్నారని విమర్శించారు. వ్యవసాయానికి మూడుగంటల విద్యుత్తు సరఫరా చాలని విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వీరి రైతు వ్యతిరేక వైఖరికి ప్రజలే తగిన విధంగా సమాధానం చెబుతారని విశ్వసిస్తున్నాని అన్నారు.
‘సమైక్య రాష్ట్రంలో భయంకరమైన బాధలు అనుభవించి వలసల జిల్లాగా పేరుపడి గోసెల్లదీసిన పాలమూరుతోపాటు రంగారెడ్డి జిల్లా రైతుల కష్టాలు కడతేర్చేందుకు ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింది. 12 లక్షల ఎకరాలకు నీళ్లివ్వడంతోపాటు, 1200 గ్రామాలకు తాగునీరందించే అమృతప్రాయమైన ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసి విపక్ష నాయకులు తమ వికృత మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నారు. తమ అల్పమైన రాజకీయ ప్రయోజనాల కోసం పాలమూరు రంగారెడ్డి జిల్లాల ప్రజలను ఉసురు పోసుకోవడానికి సిద్ధపడ్డారు. అయితే, న్యాయం ఎన్నటికైనా గెలుస్తుందన్న నమ్మకంతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నాల ఫలించాయి. విద్రోహ మనస్తత్వంతో విపక్షాలు పెట్టిన కేసులు వీగిపోయాయి. ఇటీవలే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణానికి పర్యావరణ అనుమతులు లభించాయని సంతోషంగా తెలియజేస్తున్నాను. ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న పెద్ద అవరోధం తొలగిపోయింది కనుక సత్వరమే సాగునీటి కాల్వల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టుదల వహించి, అతి త్వరలోనే ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసి, పాలమూరు రంగారెడ్డి జిల్లాలను సంపూర్ణంగా పచ్చని పంటల జిల్లాలుగా తీర్చిదిద్దుతుందని హామీ ఇస్తున్నాను. తాగునీటి అవసరాల కోసం రాబోయే కొద్దిరోజుల్లోనే రిజర్వాయర్లకు నీటి ఎత్తిపోతలను ప్రారంభిస్తామని’ సీఎం కేసీఆర్ అన్నారు.
ఆదివాసీలు, గిరిజనుల చిరకాల ఆకాంక్ష నెరవేర్చాం..
దశాబ్ది వేడుకల వేళ ఆదివాసీ, గిరిజనుల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ ప్రభుత్వం.. వారిలో ఆనందం నింపిందని సీఎం కేసీఆర్ అన్నారు. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ 1.50 లక్షల మంది ఆదివాసీ, గిరిజనులకు 4 లక్షల ఎకరాలకుపైగా పోడు భూములపై యాజమాన్య హక్కులు కలిగించిందని చెప్పారు. వారందరికీ రైతుబంధు పథకాన్ని సైతం వర్తింపజేస్తూ పంట పెట్టుబడి సాయం అందించిందని, పోడు భూముల కోసం జరిగిన ఆందోళనల్లో నమోదైన కేసుల నుంచి విముక్తి కలిపించిందన్నారు.
నేటి నుంచే హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ
రాష్ట్రంలోని గూడు లేని నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో కేసీఆర్ సర్కార్ డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టించి ఇస్తున్న సంగతి తెలిసిందే. ఒక్క రూపాయికి కూడా పేదలకు ఖర్చు లేకుండా పేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తోంది. 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని నిరుపేదలకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. నేటి నుంచే హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేస్తున్నదని కేసీఆర్ గోల్కొండ కోట వేదికగా ప్రకటించారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు.
గతంలో పేదలకు ప్రభుత్వం ఇచ్చిన నివాసం చాలీచాలని ఒకే ఒక్క ఇరుకుగది అని కేసీఆర్ పేర్కొన్నారు. అందుకు భిన్నంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా రెండు పడక గదులతో ఇండ్లు నిర్మించి ఉచితంగా అందిస్తున్నది. దీన్ని ఒక నిర్విరామ ప్రక్రియగా ప్రభుత్వం కొనసాగిస్తున్నదని తెలిపారు.
హైదరాబాద్ మహానగరంలో నిర్మాణం పూర్తిచేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న 1 లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రభుత్వం నేటినుంచే అర్హులైన పేదలకు అందజేస్తున్నది. సొంతంగా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని నిరుపేదల కోసం ప్రభుత్వం గృహలక్ష్మి అనే పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకం కింద లబ్ధిదారులకు గృహ నిర్మాణానికి మూడు దశల్లో మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నది. ముందుగా, ప్రతీ నియోజకవర్గంలో 3 వేలమందికి ఈ ప్రయోజనం చేకూరుస్తున్నది. ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించింది అని కేసీఆర్ తెలిపారు.


