రాజ్యాంగ నిర్మాత, బాబా సాహెబ్ డా.బీఆర్ అంబేద్కర్ విశ్వమానవుడు అని సీఎం కేసీఆర్ తెలిపారు. అణగారిన వర్గాల కోసం ఆయన పాటుపడ్డారని.. అంబేద్కర్ ఆశయాల సాధనకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎవరో డిమాండ్ చేస్తే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయలేదని.. ఈ విగ్రహ ఏర్పాటులో బలమైన సందేశం ఉందన్నారు. ఇది కేవలం విగ్రహం కాదని.. ఒక విప్లవమని కేసీఆర్ తెలిపారు. విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు.
ఇక నుంచి ప్రతి ఏటా అంబేద్కర్ జయంతి రోజున ఉత్తమ సేవలు అందించిన వారికి ఆయన పేరిట అవార్డులు అందజేయాలని నిర్ణయించామన్నారు. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చే దిశగా దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు పథకం తీసుకొచ్చామని కేసీఆర్ వెల్లడించారు. కాగా విగ్రహావిష్కరణకు ముందు అంబేద్కర్ విగ్రహంపై హెలికాఫ్టర్ నుంచి పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ‘జై భీమ్’ అని నినందించారు.