ఏపీలో అన్న క్యాంటీన్ మళ్లీ ప్రారంభమయ్యాయి. కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం పలువురికి సీఎం స్వయంగా భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సీఎం దంపతులు, పలువురు ప్రజాప్రతినిధులు అక్కడే భోజనం చేశారు. పేదలతో చంద్రబాబు మాట్లాడి వారిస సమస్యలను తెలుసుకున్నారు. ఇక, శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా క్యాంటీన్లు ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి రానున్నాయి. మిగతా ప్రాంతాల్లో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు.
ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎన్డీయే ప్రభుత్వం తాజాగా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. పేదోడికి మళ్లీ పట్టెడన్నం అందిస్తోంది. 203 క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించాలని మొదట భావించినా భవన నిర్మాణ పనులు పూర్తి కానందున తొలి విడతలో 100 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. రెండు, మూడు విడతల్లో మిగిలిన క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ క్యాంటీన్లలో మూడు పూటలా కలిపి రోజూ 1.05 లక్షల మంది పేదలకు ఆహారం సరఫరా చేయనున్నారు.
రోజూ ఉదయం అల్పాహారం కింద ఇడ్లీ-చట్నీ, సాంబార్ అందిస్తారు. రాత్రి అన్నంతోపాటు కూర, పప్పు/సాంబారు, పెరుగు, పచ్చడి అందిస్తారు. తాగునీటి సౌకర్యం, ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారం క్యాంటీన్లకు సెలవు ఉంటుంది. ఉదయం 35 వేల మందికి అల్పాహారం, మధ్యాహ్నం 35 వేలు, రాత్రి మరో 35 వేల మందికి ఆహారం అందిస్తారు. ఒక్కొక్కరి నుంచి పూటకు రూ.5 చొప్పున నామమాత్రపు ధర వసూలు చేస్తారు.