ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో చంద్రబాబు పెనుగొండలోని వాసవీమాతను మొదటిసారి దర్శనం చేసుకుంటున్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజును పురస్కరించుకుని ఇక్కడ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అక్కడ పూజలు అనంతరం వాసవి శాంతిధామ్‌లోని 90 అడుగుల పంచలోహ వాసవీమాతను దర్శించి విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆలయంలో నిర్వహించే పూజా కార్యక్రమాలు, హోమక్రతువు కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సర్వం సిద్ధం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 10.30 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.05కు పెనుగొండలోని AMCలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అధికారులు, నాయకులు స్వాగతం పలికిన అనంతరం 11.10 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి 11.15కి కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 11.45కి రోడ్డు మార్గాన బయలుదేరి 11.50 గంటలకు వాసవీ శాంతిధామ్‌కు చేరుకుని గురుపీఠం శిలాఫలకం ఆవిష్కరిస్తారు.