ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం నుంచి వాట్సాప్ సేవలకు శ్రీకారం చుట్టబోతుంది. దేశంలోనే తొలిసారిగా వాట్సప్ గవర్నెన్స్ సేవలు ఏపీలో అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవలను ఐటీ, విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రభుత్వం ప్రకటించనున్న వాట్సాప్ నెంబర్ ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనుంది. అలాగే వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేయనుంది.
బుధవారం వాట్సప్ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మొదటి విడతలో 161 సేవలు పౌరులకు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వం అధికారిక వాట్సప్ నంబర్‌ను ప్రకటించనుంది. ఆ ఎకౌంట్‌కు వెరిఫైడ్ ట్యాగ్ ఉంటుంది. ఈ నంబరు వన్‌స్టాప్ సెంటర్‌లా పనిచేస్తుంది. తొలిదశలో ఇందులో 161 రకాల సేవలు అందించనున్నారు. భవిష్యత్తులో వీటిని మరింత విస్తృతం చేయనున్నారు.
ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలంటే… ఈ వాట్సప్ ద్వారా సందేశం పంపిస్తుంది. అలాగే ప్రజలు తమ సమస్యలు తెలియజేయాలన్నా ఈ వాట్సప్ ఎకౌంట్ ద్వారా తెలియజేసే వీలుంటుంది. ప్రజలు తమ ఫిర్యాదును ఈ నెంబర్‌కు మెసేజ్ చేస్తే వెంటనే వారికి ఓ లింక్ వస్తుంది. అందులో పూర్తి వివరాలు.. అంటే పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ వంటి వివరాలను పొందుపరచాలి. వినతిని టైప్ చేయాల్సి ఉంటుంది. వెంటనే వారికి ఒక రిఫరెన్స్ నంబరు వస్తుంది. దాని ఆధారంగా తాము ఇచ్చిన వినతి పరిష్కారం ఎంతవరకూ వచ్చింది? ఎవరివద్ద ఉందనేది తెలుసుకోవచ్చు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను కూడా ఈ వాట్పాస్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. టికెట్లు, వసతి సహా అన్ని బుక్ చేసుకోవచ్చు. విద్యుత్ బిల్లుల చెల్లింపులు, ఆస్తి పన్నుల వివరాలు, దేవాలయాల్లో దర్శనాల స్లాట్ బుకింగ్, రెవెన్యూ శాఖకు సంబంధించిన వివరాలు, సర్టిఫికెట్లు .. ఇలా అన్ని పౌర సేవలను ప్రభుత్వం ప్రకటించిన వాట్సాప్ నెంబర్ ద్వారా పొందవచ్చు.


