చైనా కంపెనీ బంపర్ ఆఫర్
ఉద్యోగులకు జీతాలివ్వలేక లక్షలాదిమందిని తీసేస్తుంటే, చైనాలో ఒక కంపెనీ మాత్రం ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. అది కూడా లక్షా, రెండు లక్షలో కాదు… ఒకొక్కరికి రూ. 6 కోట్లు, మిగిలిన వారికి రూ.1.20 కోటి రూపాయల చొప్పున ఇచ్చింది. ఇంతకీ విషయం ఏమిటంటే అదంతా బ్యాంక్ లో వేయకుండా నగదు రూపంలో ఇచ్చింది. ఈ డబ్బులను చేతులతో పట్టుకెళ్లలేక ఉద్యోగులు పెద్ద పెద్ద సంచులను తెచ్చుకున్నారు. ఆ డబ్బులను తీసుకువెళుతున్న ఉద్యోగుల ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
చైనాకు చెందిన హెనాన్ మైన్ అనే కంపెనీ క్రేన్లను ఉత్పత్తి చేస్తుంది. గత ఏడాది కరోనా కారణంగా పలు కంపెనీలకు నష్టాలు వస్తే, హెనాన్ మైన్ కంపెనీ మాత్రం లాభాల బాటలో నడిచింది. ఆరోజుల్లో కరోనాకి వెరవకుండా, ప్రాణాలకు తెగించి ఫీల్డ్ మీద తిరిగి అమ్మకాలు పెంచిన కొందరు ఉద్యోగులను కంపెనీ గుర్తించింది. అలా సేల్స్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ చూపిన 30మందికి పైగా ఉద్యోగులకు 61మిలియన్ యువాన్లు (సుమారు రూ.73కోట్లు) బోనస్ ప్రకటించి ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఘనంగా ఇచ్చింది.
అలా ఒకొక్కరికి సుమారు రూ.6 కోట్ల రూపాయలు వస్తే, తర్వాత స్థానాల్లో ఉన్నవారికి రూ 1.20 కోట్లు చొప్పున ఇచ్చింది. అందరూ సంతోషంగా డబ్బులు ఇళ్లకు తీసుకువెళుతుంటే సామాజిక మాధ్యమాల్లో చూసిన వారు హాశ్చర్యంగా నోరెళ్లబెట్టారు. ఒక సెక్షన్ వారికే బోనస్ లు ఇవ్వడం, మిగిలిన వారికి ఇవ్వకపోవడంతో కంపెనీలో పనిచేసే ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంట. వాళ్లు సేల్స్ పెంచితే, మేం ప్రొడక్షన్ తీసుకురావద్దా? మేం వర్క్ చేయకుండానే అంతా అయిపోయిందా? అని ఇతరులు వాపోతున్నారని తెలిసింది. మరి కంపెనీ వారికేమైనా ఇస్తుందా? అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.