Child Care: పిల్లల ఆరోగ్యం, వారి ఎదుగుదల కోసం తల్లిదండ్రులు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. దీనిలో భాగంగా తమ పిల్లలు తినే ప్రతి వస్తువును పెడతారు. ఈ సమయంలో పిల్లలకు పెట్టే ఆహారాల విషయంలో కొంత జాగ్రత్త వహించాలంటున్నారు వైద్య నిపుణులు. పిల్లలకు పెట్టకూడని ఆహారం పెడితే ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. అందుకే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంటారు. పిల్లల డైట్ విషయంలో ముఖ్యంగా ఆరోగ్య నిపుణులు సలహా కూడా తీసుకోవడం మంచిది. సాధారణంగా ప్రతి తల్లిదండ్రులు పిల్లల మానసిక అభివృద్ధికి అవసరమైన అన్ని పనులు చేస్తారు. అయితే పిల్లవాడు శిశువుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారం, స్నానం, నిద్ర, ఏడుపు కారణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అయినప్పటికీ కొన్నిసార్లు తల్లిదండ్రులు తప్పులు చేస్తారు. వీటివల్ల శిశువుకు హాని కలుగుతుంది. కొంతమంది తల్లులు పసిపిల్లలకి కొన్ని ఆహారాలని తినిపిస్తారు. ఇది వారి ఆరోగ్యానికి మంచిది కాదు. అలాంటి కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం.
కాల్చిన మాంసం: కాల్చిన మాంసం చిన్నపిల్లలకి అస్సలు తినిపించకూడదు. చిన్నపిల్లలే కాదు వృద్ధులు కూడా వీటిని తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు శిశువుకు ఇలాంటి మాంసాన్ని తినిపిస్తారు. ఇది వారి ఆరోగ్యానికి మంచిది కాదు. మీరు కావాలంటే ఉడికించిన మాంసాన్ని పిల్లలకి తినిపించవచ్చు.
తీపి పదార్థాలు: తీపి పదార్థాలు, పంచదారతో తయారు చేసిన ఆహారాలని పిల్లలకు ఎక్కువగా తినిపించకూడదు. ప్రస్తుత కాలంలో పసిపిల్లలకి తల్లిదండ్రులు ఎక్కువగా చాక్లెట్లని అలవాటు చేస్తున్నారు. ఈ చాక్లెట్లు అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. కానీ వీటిలో ఉండే రసాయనాలు శిశువుకు అనారోగ్యం కలిగిస్తాయి. తీపి విషయాలు పిల్లల శారీరక అభివృద్ధిపై మాత్రమే కాకుండా మానసిక అభివృద్ధిపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతాయి.