వైసీపీలో ఇంఛార్జ్‌ల మార్పు వ్యవహారం స్పీడందుకుంది. ఇప్పటికే తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులతో మాట్లాడిన ముఖ్యమంత్రి తన వద్ద ఉన్న నివేదికలను, ఆయా ప్రాంతాల్లో పార్టీ పరిస్థితిని, ఎమ్మెల్యే పనితీరును వారి ముందుంచుతున్నారు. ఈ క్రమంలోనే కొందరికి స్థాన చలనం కలిగిస్తున్నారు. మరికొందరికి ఈసారి సీటు ఇవ్వటం కష్టమని తేల్చిచెబుతున్నారు. మరికొందర్నీ ఎంపీ బరిలో దిగాలని సూచిస్తున్నారు. అయితే.. ఈ విషయంలో అధినేత నిర్ణయమే ఫైనలంటున్నారు పలువురు ఎమ్మెల్యేలు.
సీఎంవో నుంచి ఫోన్లు వస్తుండడంతో ఆఘమేఘాల మీద తాడేపల్లికి చేరుకుంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు. వచ్చే ముందే తమకు స్థాన చలనం కలిగిస్తారా.. లేక టికెట్ లేదంటారా లేదంటే ఎంపీగా వెళ్లమంటారా అనే లెక్కల్లో మునిగి తేలుతున్నారు. తాజాగా.. కర్నూలు, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీసుకు వచ్చారు.
తాడేపల్లికి వచ్చిన వారిలో ఎమ్మెల్యేలు బ్రిజేందర్ రెడ్డి, నవాజ్ పాషా, బియ్యపు మధుసూదన్ రెడ్డి ఉన్నారు. ఈసారి అసెంబ్లీ బరిలో దిగుతారని భావిస్తున్న ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్ సైతం సీఎం ఆఫీసుకు వచ్చారు. ఇక, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు సైతం సీఎంవో నుంచి ఫోన్ కాల్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. కానీ, ప్రస్తుతం తాను రాలేనని.. మరో రోజు వస్తానని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
మొత్తంగా 40 నుంచి 50 మంది వరకు సిట్టింగ్‌లను మార్చే యోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో.. ఎప్పుడు ఎవరికి సీఎంవో నుంచి ఫోన్లు వస్తాయోనన్న ఉత్కంఠ ఆయా ఎమ్మెల్యేల్లో నెలకొంది.