స్వతంత్ర, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు మొదటి విడత మ్యానిఫెస్ట్ ఒక మ్యాజిక్ అని పేర్కొన్నారు మంత్రి విడదల రజిని.పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆమె మాట్లాడుతూ.. కర్నాటక కాంగ్రెస్ మ్యానిఫెస్టోను కాపీ కొట్టారని అన్నారు. చంద్రబాబుకి సొంత ఆలోచన, సిద్దాంతం అంటూ ఏమీ ఉండవన్నారు. మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలు కష్టాలను తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా మ్యానిఫెస్టో ఇచ్చారని అభిప్రాయం వ్యక్తం చేశారు. మా మ్యానిఫెస్టోను ఇప్పుడు కూడా చూపిస్తున్నాం. చంద్రబాబు వారి మ్యానిఫెస్టోను చూపించగలరా..? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు మహిళలకు చేసిన మోసాన్ని రాష్ట్ర మహిళలు మర్చిపోలేదన్నారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసి ఇప్పుడు ఉచిత రవాణా అంటూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు, యువత గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్న రజని.. లోకేష్ కు మంత్రి పదవి ఇస్తే యువతకు ఉద్యోగాలు ఇచ్చినట్లేనా? అంటూ వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించారు.