- రోజంతా కుప్పంలో టెన్షన్…టెన్షన్..!
- బాబు రోడ్ షోను అడ్డుకొన్న పోలీసులు
బుధవారం రోజంతా కుప్పంలో టెన్షన్ వాతావరణం కొనసాగింది. మాజీ సీఎం చంద్రబాబు టూర్ ఖరారు అయినప్పటి నుంచీ ఉద్రిక్తత మొదలైంది. ఈ టూర్‌ను అడ్డుకుంటామని పోలీసులు ఉదయం నుంచే ఫీలర్లు వదులుతూ వచ్చారు. అయినప్పటికీ పరిస్థితిని అంచనా వేసుకొంటూ మధ్యాహ్నానికి బెంగళూరు చేరుకొన్నారు చంద్రబాబు. అక్కడ నుంచి రోడ్ మార్గంలో కుప్పంలోకి అడుగు పెట్టారు.
నియోజకవర్గంలోని పెద్దూరులో చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. రోడ్ షోలు, సభలకు అనుమతి లేదని చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. నోటీసులను చంద్రబాబు తిరస్కరించారు. డీఎస్పీ సుధాకర్‌రెడ్డితో చంద్రబాబు వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో పర్యటనను కొనసాగిస్తానని చంద్రబాబు అంటున్నారు. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు.
దీంతో అక్కడే ఆందోళనకు చంద్రబాబు పూనుకున్నారు. వైసీపీ మీద తీవ్ర విమర్శలకు దిగారు. వైసీపీ పని అయిపోయిందని, టీడీపీ అంటే వైసీపీకి వణుకు పుడుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం పర్యటనలో ఆయన మాట్లాడుతూ… నా నియోజకవర్గం ప్రజలతో నేను మాట్లాడొద్దా అని ప్రశ్నించారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. పోలీసులు మైక్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. తన పర్యటన గురించి ముందే పోలీసులకు చెప్పానన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్నారన్నారు. సైకో పాలన పోవాలి.. సైకిల్ పాలన రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు బేడీలు వేయండని పేర్కొన్నారు. వైసీపీకి, టీడీపీకి వేర్వేరు రూల్స్ ఉంటాయా ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో మీ ఆటలు సాగవని స్పష్టం చేశారు. మొత్తంగా కుప్పంలో వేడెక్కిన వాతావరణం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. దీనిపై తదుపరి కార్యాచరణను తెలుగుదేశం పార్టీ సిద్ధం చేస్తోంది.