టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ సభ ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు. గన్నవరం మండలం కేసరపల్లి మేధా టవర్స్ ప్రక్కన చంద్ర బాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేదికను ఏర్పాటు చేశారు. ఈ పనులను టీడీపీ నేతలు, అధికారులు పర్యవేక్షిస్తు న్నారు. సభా వేదిక నిర్మాణ పనులు పూర్తి కావొస్తున్నాయి. 80 అడుగుల వెడల్పు 60 అడుగుల పొడవు ఎనిమిది అడుగుల ఎత్తుతో స్టేజిని సిద్ధం చేస్తున్నారు. జర్మన్ హాంగర్స్‌తో భారీ టెంట్‌ను ఏర్పాటు చేశారు. వచ్చే అతిథులు, వీఐపీల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రధాని మోధీ సహా పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, కేంద్ర మంత్రులు ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీ కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేశారు. స్థల ప్రభావం వల్ల పాసులు ఉన్న వారిని మాత్రమే ప్రమాణ స్వీకారకార్యక్రమానికి అనుమతిస్తున్నారు.


