స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఓట్ల తొలగింపు వివాదాల రచ్చ సాగుతోంది. ముఖ్యంగా అధికార వైసీపీ నేతలు క్షేత్రస్ధాయిలో బీఎల్వోలు, ఈఆర్వోలపై ఒత్తిడి తెచ్చి తమ ఓట్లను తొలగిస్తున్నారంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇదే అంశంపై గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ఈసీ కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా గతేడాది జనవరి నుంచి తొలగించిన ఓట్లను తిరిగి పరిశీలించాలని ఆదేశాలు ఇచ్చింది. వీటిపై వైసీపీ స్పందించింది. రాష్ట్రంలో ఓట్ల తొలగింపు పేరుతో జరుగుతున్న రచ్చపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. టీడీపీ గతంలో చేసిన తప్పుల్ని సరిచేస్తున్నట్లు సజ్జల తెలిపారు. గతంలో టీడీపీ హయాంలో వ్యవస్ధల్ని మేనేజ్ చేసి అక్రమాలు చేశారని ఆరోపించారు.
వీటిపై తాము గతంలోనూ పోరాడినట్లు ఆయన పేర్కొన్నారు. టక్కుటమార విద్యల్లో చంద్రబాబు పీహెచ్డీ చేశారని సజ్జల విమర్శించారు. టీడీపీ గతంలో తొలగించిన ఓట్లను తాము తిరిగి చేర్పిస్తున్నట్లు సజ్జల వెల్లడించారు. రాష్ట్రంలో లక్షలాది దొంగ ఓట్లు ఇంకా ఉన్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వాటిని ఈసీ తొలగిస్తే ప్రజాతీర్పు కచ్చితంగా వస్తుందని భావిస్తున్నట్లు సజ్జల తెలిపారు. రాష్ట్రంలో పలుచోట్ల బయటబడిన దొంగఓట్ల వ్యవహారాల్ని సజ్జల గుర్తుచేశారు. కుప్పంలోనే 30 వేల దొంగఓట్లు బయటపడ్డాయన్నారు.
దీంతో టీడీపీకి భయం పట్టుకుందన్నారు. టీడీపీ గతంలో అక్రమంగా తీసేయించిన ఓట్లను తాము తిరిగి చేర్పిస్తున్నట్లు సజ్జల వెల్లడించారు. ఉరవకొండలో ఓట్లను అక్రమంగా తొలగించలేదని, కేవలం తొలగింపులో ప్రొసీజర్ పాటించకపోవడం వల్లే అధికారులు సస్పెండ్ అయ్యారన్నారు.