రాష్ట్రంలో విధ్వంసమైన వ్యవస్థలను బాగుచేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వం పోగొట్టిన బ్రాండ్‌ను తిరిగి తీసుకువచ్చే బాధ్యత తీసుకున్నట్లు వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా సీ ప్లేన్ పర్యాటకాన్ని లాంఛనంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరో ముఖ్యమైన అడుగు పడింది. పర్యాటక రంగంలో సరికొత్త అనుభూతి ప్రజలకు త్వరలోనే అందుబాటులో రానుంది. దేశంలోనే తొలిసారిగా సీ ప్లేన్ వినియోగాన్ని మరికొన్ని రోజుల్లో ప్రారంభించనుంది ఏపీ సర్కారు. ఇందుకు సంబంధించి సీ ప్లేన్ పర్యాటకాన్ని లాంఛనంగా ప్రారంభించారు సీఎం చంద్రబాబు నాయుడు.
విజయవాడలోని పున్నమిఘాట్ నుంచి శ్రీశైలం వరకు సీ ప్లేన్‌లో పర్యటించారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. శ్రీశైలం జలాశయంలో సీ ప్లేన్ ల్యాండవ్వగానే ఒక్కసారిగా అంతా చప్పట్లతో స్వాగతం పలికారు. ఈ విమానంలో ముఖ్యమంత్రితోపాటు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు ప్రయాణించారు. సీ ప్లేన్ పర్యాటకం లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. భవిష్యత్ అంతా పర్యాటకానిదేనన్నారు. రాబోయే రోజుల్లో ఏ ఇజం ఉండదని..కేవలం టూరిజం ఒక్కటే ఉంటుందని అన్నారు. సీ ప్లేన్ ప్రయాణం ఓ వినూత్న అవకాశమని తెలిపారు. రాబోయే రోజుల్లో విమానాశ్రయాలే కాకుండా సీ ప్లేన్ ద్వారా రవాణా సౌకర్యం పెరుగుందన్నారు ముఖ్యమంత్రి.
రాష్ట్రంలో విధ్వంసమైన వ్యవస్థను బాగు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. గాడి తప్పిన పాలనను సరిచేయడమే తమ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం పోగొట్టిన బ్రాండ్‌ను తిరిగి తీసుకువచ్చే బాధ్యత తీసుకున్నట్లు వెల్లడించారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ప్రజలు ఆక్సీజన్ అందించారని అన్నారు సీఎం చంద్రబాబు. సీ ప్లేన్ ప్రయాణం సామాన్యులకు సైతం అందుబాటు ధరల్లో ఉంటుందన్నారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు. మరో మూడు నాలుగు నెలల్లో రాష్ట్రంలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. మొత్తం నాలుగు రూట్లలో నడిపేందుకు వచ్చిన ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు. మొత్తంగా… సీ ప్లేన్ ప్రయాణం సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది అనడంలో ఏ సందేహం లేదు. దీంతో.. ఈ సౌలభ్యం రాష్ట్రంలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఎంతో మంది ఆరా తీయడం మొదలుపెట్టారు.